వైయస్ జగన్ ను కలిసిన చీలి సింగయ్య కుటుంబ సభ్యులు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో చీలి సింగయ్య మృతి రాజకీయంగా పెను దుమారం లేపింది. వైయస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రమాదం జరగటంతో జగన్ కాన్వాయ్ లోని వాహనం మీదకు ఎక్కి చీలి సింగయ్య మృతి చెందినట్లు అధికార పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు. పోలీసులు వైయస్ జగన్ పై కేసు కూడా నమోదు చేశారు.ఈ నేపథ్యంలో బుధవారం చీలి సింగయ్య భార్య లూర్ద్ మేరీ, కుమారులు, కుటుంబ సభ్యులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.సింగయ్య కుటుంబానికి అండగా నిలుస్తానని ప్రకటించిన వైయస్ జగన్ వారి పార్టీ నాయకుల ద్వారా ఇప్పటికే రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అందించారు. వైయస్ జగన్ ను కలిసిన అనంతరం మీడియా ముఖంగా సింగయ్య మృతిపై భార్య లూర్దుమేరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆసుపత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్ లో ఏదో జరిగిందని ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లనీయలేదని ఆమె అన్నారు. చిన్న చిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడని ఏదో చేశారని మాకు అనుమానంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. లోకేష్ మనుషులు 50 మంది తమ ఇంటికి వచ్చారని,తాము చెప్పినట్లు చెప్పాలని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.మేం కూడా మీ కులస్థులమేనని చెప్పారనికాగితాలపై ఏదో రాసుకొచ్చి సంతకాలు చేయమన్నారని సంతకం చేయకపోవడంతోబెదిరించారని వాపోయారు. పోలీసులు కూడా వీడియో చూపిస్తూ సంతకాలు చేయమన్నారని తమ మీద ఎన్నో రకాలుగా ఒత్తిడి చేశారని తమ కుటుంబానికి జగన్ అంటే ఇష్టం అని సింగయ్య భార్య అన్నారు. సింగయ్య కుటుంబ సభ్యులు వైయస్ జగన్ కలవడం పట్ల అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

