నమీబియా నుండి చిరుతలు.. మోదీకి బర్త్‌డే గిఫ్ట్
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం ఈ నెల 17. ఈ సందర్భంగా దేశానికి ఒక అరుదైన కానుకను ఇవ్వబోతున్నారు. అది ఏమిటంటే మధ్యప్రదేశ్‌లోని శివ్ పూర్ జిల్లాలో కునో నేషనల్ పార్క్ వద్ద చిరుత పులుల ఖండాంతర తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఆఫ్రికాలోని నమీబియా నుండి చిరుత పులులను ఇక్కడి కునో నేషనల్ పార్క్‌లో ప్రవేశపెట్టబోతున్నారు. ఓ ఖండంలో జీవిస్తున్న చిరుతలను మరో ఖండానికి తీసుకురావడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి.

మోదీ పర్యటనకు ఒకరోజు ముందుగా నమీబియా నుండి చిరుతలను కునో ప్రాంతానికి తీసుకువస్తారు. ఇక్కడ 10 హెలీప్యాడ్‌లు ఇప్పటికే నిర్మించారు. సుమారు 9 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి చిరుత పులులు ఇక్కడికి వస్తాయి. ప్రధాని కార్యాలయం నుండి ఇప్పటికే మధ్యప్రదేశ్ సీఎంవోకు సమాచారం అందింది. అధికారులు కునో ప్రాంతంలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు సెప్టెంబరు 14 నుండి 20 వ తేదీ వరకు బుక్ చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ప్రధాని మోదీని ఆహ్వానించారు.