Home Page SliderTelangana

ఎన్టీఆర్ కృష్ణుడి విగ్రహంలో హైకోర్టు ఆదేశానుసారం మార్పులు

ఖమ్మంలోని ‘లకారం ట్యాంక్‌బండ్‌పై’ కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయబోతున్న వంద అడుగుల ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు చేయాలని తెలంగాణా హైకోర్టు ఆదేశించింది. దీనితో విగ్రహానికి గోల్డ్ కలర్ వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ విగ్రహం  చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి.రాజకీయ, సామాజిక, పర్యావరణ నిపుణులు రకరకాల అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. దీనిపై హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ను కృష్ణుడి రూపంలో పెట్టడంతో భవిష్యత్ తరాల వారు ఎన్టీఅరే కృష్ణుడు అనుకునే ప్రమాదం ఉందని, హిందూ యాదవ సంఘాలు గగ్గోలు పెడుతున్నారు. ఎన్టీఆర్‌ను మహానటుడుగా, అభిమాన నాయకునిగా అభిమానించినా భగవంతుని స్థాయిలో పోల్చరాదని వారి వాదన. కావాలంటే మనిషిగా ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోమని, కానీ కృష్ణుని రూపంలో పెట్టడాన్ని అంగీకరించమంటున్నారు. యాదవ, కమ్మ సంఘాల వారి ఓట్ల కోసమే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని మండిపడుతున్నారు రాజకీయపక్షాలు. తాజాగా హైకోర్టు ఆదేశానుసారం ఈ విగ్రహంలోని కిరీటంలో నెమలి పింఛం, విష్ణు చక్రం, పిల్లనగ్రోవిని తొలగించారు. ఈ విగ్రహావిష్కరణ ఈ నెల 28న ‘జూనియర్ ఎన్టీఆర్’  చేతులమీదుగా జరగబోతోంది. మంత్రి పువ్వాడ అజయ్ సారథ్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.