NewsTelangana

షర్మిల పద్ధతి మార్చుకో…

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ నిప్పులు చెరిగారు. షర్మిల మాట్లాడే భాష ఆడబిడ్డలు మాట్లాడే భాషేనా అని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేశారన్నారు. నాడు వైఎస్‌ నంద్యాలలో హైదరాబాద్‌కు పోవాలంటే వీసా తీసుకుని పోవాలని హేళన చేశారన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి జరిగినప్పుడు ఈ గవర్నర్‌కు ఆమె ఆడబిడ్డ అని గుర్తుకు రాలేదా అని బాల్కసుమన్‌ ప్రశ్నించారు. రెచ్చగొట్టే అసత్యాలు చెబుతున్న వైఎస్‌ షర్మిలను వెనకేసుకురావడం గవర్నర్‌ తమిళిసై తగదని హితవు పలికారు. ఆ సమయంలో షర్మిల కూడా హైదరాబాద్‌లో సీమాంధ్రులు బ్రతకాలంటే పాకిస్తాన్‌లో బ్రతికినట్లు అనే వ్యాఖ్యలు చేశారని బాల్కసుమన్‌ పేర్కొన్నారు. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ఫ్లకార్డులు ప్రదర్శించారన్నారు. షర్మిల తన భాష మార్చుకోకపోతే ఏమైనా అయితే ఇక నుంచి తమకు సంబంధం లేదన్నారు బాల్క సుమన్‌.