ఏపీ అసెంబ్లీని ఆ సభతో పోల్చిన చంద్రబాబు
ఏపీ అసెంబ్లీలో ఇవాళ జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యేపై దాడి, ఏపీ చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదన్నారు. సీఎం జగన్ ప్రోద్బలంతోనే దళిత ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇది అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజని అభివర్ణించారు. జగన్మోహన్ రెడ్డికి చట్టసభలంటే గౌరవం లేదన్నారు. ఇది శాసనసభ కానే కాదని.. ముమ్మాటికి కౌరవ సభ అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ జీవో నెంబర్ 1ని రద్దు చేయాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనికి స్పీకర్ అంగీకరించలేదు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్ద దూసుకొచ్చారు. తప్పు చేస్తే స్పీకర్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి గానీ… వైసీపీ ఎమ్మెల్యేలు గుండాల్లా దాడులు చేయడమేంటని ప్రశ్నించారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. 75 ఏళ్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి దాడి చేయడం దారుణమన్నారు. ఐతే అందుకు వైసీపీ కౌంటర్ వర్షన్ విన్పిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లినే, బుచ్చయ్య చౌదరి నెట్టేశారని.. దీంతో ఆయన కిందపడిపోబోయారంది. మరోవైపు ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు దాడి చేశారని టీడీపీ నేతలు చెబుతుంటే.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామినే ఎమ్మెల్యే బాలవీరాంజనేయులు దూషించారంటూ ఆ పార్టీ వర్షన్ విన్పించారు.