పంచాయితీ తేలదు.. బకాయిలు రాలవు
తెలుగు రాష్ట్రాల మధ్య కరెంటు బకాయిల పంచాయితీ ఇప్పట్లో తేలేటట్టు లేదు. ఏపీ నుంచి తీసుకున్న కరెంటుకు డబ్బులు కట్టాలని కేంద్రం ఆదేశించడంపై తెలంగాణ మండిపడుతోంది. 30రోజుల్లో డబ్బులు కట్టేయాలా? కుదరదంటే కుదరదంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు చేసిన అప్పుల సంగతి ముందు తేల్చాలని తెలంగాణ పట్టుబడుతోంది. అటు విభజన చట్టంతో సంబంధం లేని అంశాన్ని విభజన సమస్యలతో ముడిపెడుతున్నారని ఏపీ ఆరోపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కరెంటు బకాయిల అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది.

ఏపీ జెన్కోకు చెల్లించాల్సిన బకాయిలను అసలు, వడ్డీతో సహా కలిపి కట్టేయాలని కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ తెలంగాణ విద్యుత్ సంస్థలను తాజాగా ఆదేశించింది. జెన్కో సరఫరా చేసిన విద్యుత్‌కు 3441.78కోట్ల రూపాయలు. దీనిని చెల్లించడంలో జరిగిన జాప్యానికి సర్‌చార్జి రూపేణా 3315.14కోట్ల రూపాయలు. 2022జులై 31నాటికి మొత్తం కలిపి 6756.92కోట్ల రూపాయలు 30రోజుల్లో చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ ఆదేశించింది. తెలంగాణ విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చింది. రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఏపీ జెన్కో తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసింది. విభజన చట్టంలోని సెక్షన్-92 ప్రకారం బకాయిలు చెల్లించేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ సరఫరా జరిగినందున ఈ అంశాన్ని విభజన వివాదాలతో ముడిపెట్టడానికి వీల్లేదని కేంద్రం పేర్కొంది. 30రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని పేర్కొంటూ కేంద్ర ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేంద్రం ఏకపక్షంగా ఆదేశాలు ఇచ్చిందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది.
2014జూన్ 2 నుంచి 2017జూన్ 10వరకు తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ జెన్కో కరెంటు సరఫరా చేసింది. ఉత్పత్తి సంస్థలతో ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) ధరలను అనుసరించి తీసుకున్న విద్యుత్‌కు తెలంగాణ డిస్కంలు డబ్బులు కట్టాలి. అయితే అందుకు ససేమిరా అంటోంది. రాష్ట్ర విభజనకు ముందు ఏపీకి చెందిన అనంతపురం, కర్నూలు జిల్లాలు తెలంగాణ విద్యుత్ సంస్థ CPDCL పరిధిలో ఉన్నాయి. ఈరెండు జిల్లాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు,అభివృద్ధి పనులకు విద్యుత్ సంస్థలు అప్పట్లో అప్పులు తీసుకున్నాయి. అదంతా కలిపి 12,941కోట్లు ఉందని తెలంగాణ విద్యుత్ సంస్థలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన అప్పులతో ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో విద్యుత్ అభివృద్ధి పనులు చేపట్టారని ఈ వివాదం పరిష్కారం కాకుండా ఏపీ నుంచి తీసుకున్న కరెంటుకు డబ్బులు కట్టలేమని తెలంగాణ డిస్కమ్‌లు ఇంతకాలం చెబుతూ వచ్చాయి. దీనిపై ఏపీ జెన్కో కోర్టుకు వెళ్లింది. తాము రాష్ట్ర విభజన తర్వాతే కరెంటు సరఫరా చేశామని అది కూడా కేంద్రం ఆదేశించడం వల్లే తెలంగాణకు కరెంటు ఇచ్చామని ఏపీ చెప్పుకొచ్చింది.
దీంతో ఎట్టకేలకు కరెంటు సరఫరాకు సంబంధించిన పెండింగ్ బకాయిలు 6756.92కోట్ల రూపాయలు 30రోజుల్లో ఏపీకి చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం విమర్శలు సంధించింది. ఏపీ జెన్కోకు డబ్బులు కట్టాలని తెలంగాణను కేంద్రం ఆదేశించడం దేశద్రోహ చర్య అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి. ఏపీ నుంచే తమకు 12,941 రావాలన్న ఆయన దీనిపై కేంద్రం జోక్యం చేసుకోలేదని ఆక్షేపించారు. ఏపీ రాసిన లేఖలు కేంద్రానికి కనిపిస్తున్నాయి, తెలంగాణ రాసిన లేఖలను కేంద్రం పట్టించుకోకుండా ఏపక్షంగా ఏపీ బకాయిలు చెల్లించాలని ఆదేశించిందని ఆయన మండిపడ్డారు. అంతే కాదు విద్యుత్ బకాయిలను జలవివాదాలతో ముడిపెడుతూ కృష్ణ, గోదావరి జలాల విషయంలోను కేంద్రం ఇలాగే వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇప్పటికిప్పుడు కరెంటు బకాయిలు కట్టే ఉద్దేశం తమకు లేదని తెలంగాణ మంత్రి సంకేతాలిచ్చారు. అటు ఉమ్మడిగా చేసిన అప్పుతో ఏపీలోని రెండు జిల్లాల కోసం ఖర్చుపెట్టిన సంగతి కూడా తేలాల్సిందే అంటున్నారు. దీంతో రాజకీయ రంగు పులుముకున్న ఈ వ్యవహారం ..ఎప్పటికి తేలుతుందో అంటూ ఏపీ జెన్కో తలపట్టుకుంటోంది.