ఆసుపత్రి బిల్లులపై కేంద్రం సంచలన నిర్ణయం..
సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రి బిల్లుల నియంత్రణకు సంచలన నిర్ణయం తీసుకుంది. మితిమీరిన వైద్య ఖర్చులు, ఆసుపత్రి బిల్లులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝలిపించనుంది. దేశంలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్య ఖర్చులు నియంత్రణకు కొత్త మార్గదర్శకత్వాలను రూపొందిస్తోంది. ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు మరియు డయాగ్నస్టిక్ కేంద్రాలతో సహా అన్ని క్లినికల్ సంస్థలకు వర్తించే ఆసుపత్రి బిల్లుల కోసం కేంద్రం త్వరలో ఒక ప్రామాణికాలను రూపొందిస్తోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిర్ణయం ప్రకారం హాస్పటల్ ట్రీట్‌మెంట్ కస్టమర్ సెంట్రిక్‌గా ఉండాలని పేర్కొంది. యూనియన్ హెల్త్ మినిస్ట్రీ, బీఐఎస్ కలిసి సంయుక్తంగా ఈ ప్రణాళికను రూపొందించాయి. ప్రైవేట్ ఆసుపత్రులు వారి సొంత మందులను అంటగట్టేలా ప్రవర్తిస్తున్నాయని, అవి బయట దొరికే మందుల కన్నా ఎన్నో రెట్లు ఖరీదైనవిగా ఉన్నాయని సుప్రీంకోర్టు గుర్తించింది. రాష్ట్ర హైకోర్టులను ఈ విషయంలో వాటిని నియంత్రించేందుకు ఆదేశాలివ్వాల్సిందిగా సూచించింది. వివిధ ఆసుపత్రులలో ఒకే వ్యాధికి ఇచ్చే ట్రీట్‌మెంట్స్, వాటి మందుల విషయంలో తేడాలున్నాయని పేర్కొంది. పేషెంటుకు అందుబాటులో ఉండేలా ఫీజులను, మందుల ఖరీదులను నియంత్రించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలు అమలులోకి తీసుకురానుంది.

