జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్‌సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలకు మద్దతుగా వైఎస్ జగన్ డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు. ఇక మరోవైపు, ఆయన యూరప్ పర్యటనకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
జగన్ తన కుమార్తెల వద్దకు వెళ్లేందుకు అనుమతి కోరగా, సీబీఐ కోర్టు అక్టోబర్ 1 నుంచి 30 వరకు 15 రోజులపాటు విదేశీ పర్యటనకు షరతులతో అనుమతిచ్చింది. పర్యటన ముగిసిన అనంతరం స్వయంగా కోర్టుకు హాజరై, యూరప్ నుంచి తిరిగి వచ్చిన తేదీని లిఖిత పూర్వకంగా సమర్పించాలని ఆదేశించింది.
జగన్ తరఫు న్యాయవాది, ఆయన ఎప్పుడూ కోర్టు షరతులను ఉల్లంఘించలేదని వాదించగా, సీబీఐ తరఫు ప్రాసిక్యూటర్ దీనికి విభేదించారు. ఆర్థిక నేరాల కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయనకు విదేశీ పర్యటనలకు అనుమతివ్వకూడదని వాదించారు. గతంలో కూడా పర్యటనల అనంతరం కోర్టులో హాజరుకాలేదని గుర్తుచేశారు. దీంతో, ఈసారి న్యాయస్థానం మరింత కఠినమైన షరతులు విధించింది.
జగన్ తన పర్యటన పూర్తి షెడ్యూల్‌ను కోర్టుకూ, సీబీఐకూ అందజేయాలని, నవంబర్ 14 లోపు కోర్టులో హాజరై విదేశీ పర్యటన వివరాలను స్పష్టంగా నివేదించాలని ఆదేశించింది.
అక్టోబర్ తొలి వారంలోనే యూరప్ వెళ్లనున్న జగన్ తిరిగి వచ్చాక జిల్లాలో జరగనున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీపావళి తర్వాత ఆయన రాజకీయంగా మరింత చురుగ్గా దీక్షలు, పర్యటనల్లో పాల్గొంటారని స్పష్టమైంది.