Home Page SliderNational

2 వేల నోట్ల రద్దు సరే, మరి మూడున్నర లక్షల కోట్లు మార్చుకునేదెలా?

రూ. 2,000 నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ప్రజలు సెప్టెంబర్ 30 లోపు వాటిని మార్చుకోవచ్చు, లేదా వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 19 ప్రాంతీయ కార్యాలయాలు, ఇతర బ్యాంకుల్లో 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. మే 23 నుండి తక్కువ వాల్యూ ఉన్న నోట్లతో 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. తక్షణమే ₹ 2,000 నోట్ల జారీని నిలిపివేయాలని RBI అన్ని బ్యాంకులకు సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రికి రాత్రే అధిక విలువ గల ₹ 1,000, ₹ 500 నోట్లను రద్దు ప్రకటన తర్వాత RBI నవంబర్ 2016లో ₹ 2,000 నోటును ముద్రించడం ప్రారంభించింది. “ఇతర డినామినేషన్లలోని నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ₹ 2,000 నోట్లను ప్రవేశపెట్టాలనే లక్ష్యం నెరవేరింది. అందువల్ల, 2018-19లో ₹ 2000 నోట్ల ముద్రణ నిలిపివేశాం” అని RBI ఒక ప్రకటనలో తెలిపింది. “సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా, మే 23, 2023 నుండి ఏ బ్యాంక్‌లోనైనా ₹ 2,000 నోట్లను ఇతర డినామినేషన్‌ల నోట్లలోకి మార్చుకోవచ్చు. ” అని RBI తెలిపింది.

ప్రజలు తక్కువ విలువ కలిగిన నోట్లను సెప్టెంబర్ 30 వరకు ఒకేసారి ₹ 20,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చని లేదా మార్చుకోవచ్చని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అవసరమైతే RBI గడువును సెప్టెంబర్ 30 తర్వాత కూడా పొడిగించే అవకాశం ఉందని తెలిపింది. అయితే గడువు తర్వాత ఎవరైనా ₹ 2,000 నోటును కలిగి ఉన్నప్పటికీ, అది చెల్లుబాటు అయ్యే విధంగా తగిన నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ పేర్కొంది. “రూ. 2,000 డినామినేషన్ నోట్లలో దాదాపు 89 శాతం మార్చి 2017కి ముందు జారీ చేశారు. వాటి అంచనా జీవితకాలం నాలుగైదేళ్లు మాత్రమే. ఈ నోట్ల మొత్తం విలువ గరిష్టంగా మార్చి 31, 2018నాటికి రూ. 6.73 లక్షల కోట్ల నుండి చెలామణిలో ఉండేవి. మొత్తం నోట్లలో వాటి విలువ 37.3 శాతం. మార్చి 31, 2023న, రూ. 3.62 లక్షల కోట్లు అంటే మొత్తం నోట్లలో 10.8 శాతం మాత్రమే చెలామణిలో ఉన్నాయి” అని RBI తెలిపింది. ఈ నోటు సాధారణంగా లావాదేవీల కోసం ఉపయోగించబడదని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఆర్‌బీఐ 2013-2014లో కూడా ఇదే తరహాలో నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంది.