‘ఆయన క్షమాపణలు చెప్పినట్లు నిరూపించగలరా’? రాహుల్‌కు సవాల్
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బదులిచ్చేందుకు ఇప్పుడు రంగంలోకి సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ దిగారు. తన తాతపై చేసిన వ్యాఖ్యలకు రాహుల్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు’ పెద్దలు. లోక్‌సభ సభ్యత్వం పోగొట్టుకున్నఅనంతరం రాహుల్ గాంధీ ఆవేశంతో మాట్లాడిన మాటలకు మళ్లీ మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది.

గతంలో ప్రధాని మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యానించి, చిక్కుల్లో పడిన కాంగ్రెస్ నేత, ఇప్పుడు ‘క్షమాపణలు చెప్పడానికి నేను సావర్కర్‌ను కాదు, గాంధీని’ అంటూ వ్యాఖ్యానించి, మళ్లీ తలనొప్పి తెచ్చి పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలను శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ఖండించారు. ‘దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే మీతో చేతులు కలిపామని, కానీ మా దేవుడిని అవమానిస్తే మాత్రం ప్రతిపక్ష కూటమి చీలిపోయే అవకాశం ఉందని’ ఠాక్రే రాహుల్‌ను హెచ్చరించారు. ఇప్పుడు సావర్కర్ మనవడైన రంజిత్ మాట్లాడుతూ.. దేశభక్తుడు, హిందుత్వ సిద్ధాంతకర్త ఐన సావర్కర్ బ్రిటిష్‌వారికి ఎప్పుడు క్షమాపణలు చెప్పాడో సాక్ష్యాధారాలతో సహా నిరూపించమని, సవాల్ విసిరాడు. తన రాజకీయ ప్రయోజనాలకోసం దేశభక్తుల పేర్లను వాడుకోవడం క్షమింపరాని నేరమని మండిపడ్డాడు. ఈ విషయంలో రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.