17 లక్షల విలువైన క్యాడ్బరీ చాక్లెట్ల చోరీ
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ డిఫరెంట్ స్టయిల్లో దొంగలు క్యాడ్బరీ చాక్లెట్ల దొంగతనం చేశారు. అందరూ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో ఉంటే దొంగలు మాత్రం తమ పని తాము చేసుకుపోయారు. ప్రముఖ బ్రాండ్ క్యాడ్‌బరీకి చెందిన దాదాపు 150 కార్టన్ల చాక్లెట్ బార్లను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారు. ట్రక్కులతో వచ్చి మరీ ఈ చోరీకి పాల్పడ్డారు. చోరీకి గురైన చాక్లెట్స్ విలువ సుమారు రూ. 17 లక్షలుగా ఉన్నట్లు అంచనా వేశారు. ఆధారాలు మిగలకుండా ఉండేందుకు సీసీటీవీ డీవీఆర్‌ను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన విషయాన్ని సదరు వ్యాపారి పోలీసులకు సమాచారం అందించారు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిన్‌హట్‌లోని దేవ్‌రాజీ విహార్ ప్రాంతంలో దొంగతనం జరిగింది. చోరీ జరిగిన వాటిల్లో కొన్ని బిస్కెట్ల పెట్టెలు కూడా ఉన్నాయని వ్యాపారవేత్త రాజేంద్ర సింగ్ సిద్ధు పోలీసులకు తెలిపారు. రెండ్రోజుల క్రితమే స్టాక్ వచ్చిందని, నగరంలోని వ్యాపారులకు వీటిని పంపిణీ చేయాల్సి ఉందని, ఈ లోపు దొంగలు 17 లక్షల విలువైన చాకెట్లను దోచుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని వ్యాపారి కోరారు.