మంటగలిసిన మానవత్వం..ప్రాణాలతో స్మశానంలో వృద్ధురాలు
కలికాలంలో మానవత్వం మంటగలిసిపోతోందా అనిపిస్తుంటుంది కొన్ని సంఘటనలు చూస్తే. అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ప్రాణాలతో స్మశానంలో వదిలిపెట్టి వెళ్లారు బంధువులు. ఈ హృదయవిదారక ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కూకట్ల రాజవ్వ (70) అనే వృద్ధురాలిని స్మశాన వాటికలో ఉన్న వరండాలో వదిలేసి వెళ్లిపోయారు. ఆమె భర్త మరణించారు. పిల్లలు లేకపోవడంతో తన మేనల్లుడి ఇంట్లో నివసిస్తున్నారు. అయితే నేడు (మంగళవారం) ఆమె సోదరి పిల్లలు వచ్చి సిరిసిల్ల ఆసుపత్రికి తీసుకెళ్లి డయాలసిస్ చేయిస్తామని చెప్పి, ఆటోలో తీసుకెళ్లారు. ఆసుపత్రికి కాకుండా స్మశానవాటికకు తరలించి వదిలి వెళ్లారు. ఆమె మూలుగులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకుని స్థానిక ఎమ్మార్వోకి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అతని మేనల్లుడిని పిలిచి మందలించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని హెచ్చరించారు.

