Editorial Newshome page sliderHome Page SliderNewsTelangana

హైకోర్టు లో బీఆర్ఎస్ కు చుక్కెదురు

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఓట్ల చోరీ జరిగిందంటూ బీఆర్ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో బోగస్‌ ఓట్లు నమోదయ్యాయని మాగంటి సునీత, కేటీఆర్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై బీఆర్ఎస్‌ తరఫున న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు.
జూబ్లీహిల్స్‌లో సంబంధం లేని 12 వేల మంది బయటి వ్యక్తుల ఓట్లు నమోదయ్యాయని, ఒకే ఇంట్లో 43 మంది ఓటర్లు నమోదు అయ్యారని ఆయన కోర్టుకు తెలిపారు. బోగస్‌ ఓట్లపై ఆధారాలు సమర్పించినా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదని వాదించారు.
ఈసీ తరఫున లాయర్‌ వాదిస్తూ, సుప్రీంకోర్టులో బీహార్‌ ఎన్నికలపై ఇప్పటికే విచారణ జరుగుతోందని, నామినేషన్ల చివరి తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని కోర్టుకు తెలిపారు. బీఆర్ఎస్‌ ఇచ్చిన రిప్రజెంటేషన్లపై ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేశామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.
కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య 8 వేల మంది మాత్రమేనని, కానీ బీఆర్ఎస్‌ 12 వేలమందిని చెబుతోందని, 18 ఏళ్లు నిండిన వారే ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ వాదించింది.
వాదనలు విన్న హైకోర్టు, ఇప్పటికే ఎలక్టోరల్‌ రోల్స్‌ రివిజన్‌ ప్రక్రియ కొనసాగుతోందని, ఈ దశలో ప్రత్యేక ఆదేశాలు అవసరం లేదంటూ విచారణను ముగించింది.