కేంద్రంపై అవిశ్వాస తీర్మానం కోసం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రయత్నాలు
కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ జవాబు చెప్పవలసిందేనని పట్టుపడుతున్నారు. వర్షాకాల సమావేశాలు మొదలయినప్పటి నుండి, పార్లమెంట్ ఉభయ సభలలో ఈ అంశంపై చర్చలు జరగాల్సిందేనని ఆందోళలను జరుగుతున్నాయి. దీనితో కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్ష కూటమి (INDIA) కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధమయ్యింది. లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగొయ్, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్‌కు నోటీసులిచ్చినట్లు కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ వెల్లడించారు. బీఆర్‌ఎస్ నుండి ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా స్పీకరుకు ఇదే విషయంపై నోటీసులిచ్చారు. దీనివల్ల ప్రధాని మోదీ మాట్లాడవచ్చని, దీనితో తమకు పలు అంశాలు లేవనెత్తే అవకాశం దొరుకుతుందని ఈ కూటమి భావిస్తోంది. ఇప్పటికే ముసాయిదాను సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రతిపక్ష కూటమికి (INDIA) 140 మంది సభ్యులున్నారు. ఎన్డీఏ కూటమికి 330 మంది సభ్యులు ఉన్నారు. మరో 60 మంది సభ్యులు ఏ కూటమిలోనూ లేరు. దీనితో ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోతుందనే అందరూ భావిస్తున్నారు. కానీ మణిపూర్ అంశంపై మాట్లాడేందుకు ఇదే మంచి మార్గమని విపక్షాలు భావిస్తున్నారు.

