accidentBreaking NewsHome Page Sliderhome page sliderNewsPoliticsTelanganaviral

బీఆర్ఎస్, బీజేపీ విలీన రాజకీయం

  • సీఎం రమేష్, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం
  • రూ.1600 కోట్ల రోడ్డుశాఖ కాంట్రాక్టులపై కలకలం
  • CM రమేష్‌కు టెండర్లు ఎలా దక్కాయో వివరణ కోరుతున్న బీఆర్ఎస్
  • హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల అమ్మకానికి మద్దతుగానేనా ఈ టెండర్లు
  • “బీజేపీలో విలీనం కోసం మా ఇంటికే వచ్చారు” – సీఎం రమేష్ • “కేటీఆర్ భాష మార్చుకో” – బండి సంజయ్ వార్నింగ్
  • “కేటీఆర్ విదేశీ టూర్లపై డాక్యుమెంట్లు ఉన్నాయి అనే వాదన..

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్న అంశం బీజేపీ ఎంపీ సీఎం రమేష్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం. ఈ వివాదం కేవలం వ్యక్తిగత స్థాయిలో మిగలకుండానే, తెలంగాణలో పార్టీ రాజకీయాల దిశను మలుపు తిప్పేలా మారుతోంది. కేటీఆర్ చేసిన ఆరోపణల ప్రకారం, కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీతో అవినీతి ఒప్పందంలో భాగంగా సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కనస్ట్రక్షన్స్ సంస్థకు రూ.1,600 కోట్ల విలువైన రోడ్డు పనులను అప్పగించిందని చెప్పారు. దీనితో పాటు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకానికి సీఎం రమేష్ మద్దతు ఇస్తేనే ఈ భారీ కాంట్రాక్టులు దక్కాయని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు తక్షణమే బలమైన కౌంటర్ ఇచ్చిన సీఎం రమేష్, కేటీఆర్ మాటలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి” అని ఘాటుగా వ్యాఖ్యానించిన ఆయన, టెండర్లు పూర్తి పారదర్శకంగా, నిబంధనల మేరకు దక్కాయని, తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. అంతేకాదు, కేటీఆర్ విదేశీ ప్రయాణాలపై ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, అవసరమైతే అవి CBI, EDకు అందిస్తానని హెచ్చరించారు.ఇంతటితో ఆగకుండా, సీఎం రమేష్ చేసిన మరో సంచలన ఆరోపణ ఏమిటంటే – గతంలో బీఆర్‌ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కేటీఆర్, కవితలు తన నివాసానికి వచ్చారని, తమపై ఉన్న విచారణలు ఆపాలని కోరారని అన్నారు. అయితే తాము అంగీకరించకపోవడంతో ఇప్పుడు కేటీఆర్ తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు బీజేపీలోనూ, బీఆర్‌ఎస్‌లోనూ కలకలం రేపాయి.ఈ మాటల యుద్ధానికి మూడో నేతగా బీజేపీ నేత బండి సంజయ్ రంగప్రవేశం చేశారు. ఆయన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. కేటీఆర్‌కు మొదట టికెట్ ఇప్పించింది సీఎం రమేష్‌ నే అంటూ చేసిన వ్యాఖ్యలు, బీఆర్ఎస్–బీజేపీ మధ్య అంతర్గత సంబంధాలపై కొత్త అనుమానాలు రేకెత్తించాయి. “కేటీఆర్ చర్చకు సిద్ధమా? తేది నువ్వే చెప్పు.. వేదిక కరీంనగర్‌లో పెడతాం..” అంటూ బహిరంగ సవాల్ విసిరిన బండి సంజయ్, కేటీఆర్‌ మాటల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన, “నీ బాష మార్చుకో. లేకపోతే దాడులు చేయాల్సి వస్తుంది” అని హెచ్చరించారు.

కేటీఆర్ కూడా తీవ్రంగానే స్పందించారు “తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్‌ఎస్ ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మా పార్టీకి లేదు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని దాచేందుకు బీజేపీ రూపొందించిన స్కెచ్‌లే” అంటూ ఆయన పేర్కొన్నారు. సెంటిమెంట్ రాజకీయాలు తిరిగి బీఆర్‌ఎస్ ఆధిపత్యాన్ని తీసుకురావాలన్న ఆలోచనలో భాగంగా సీఎం రమేష్ అంశాన్ని లేవనెత్తుతున్నారని, బీజేపీతో కాంగ్రెస్ కలిసి రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే — ఇది కేవలం వ్యక్తిగత విమర్శల పరంపర కాదు. ఈ విమర్శలు రెండు పార్టీల మధ్య గతంలో జరిగిన రాజకీయ చర్చలకు అద్దం పడుతున్నాయా? లేక ఇటీవలి పాలనా వైఫల్యాలను మరిచిపోయేలా ప్రజలను మళ్లించేందుకు కావాలనే రూపొందించిన వ్యూహమా? అన్నది ఇప్పుడు ప్రజల్లో పెద్ద చర్చగా మారింది. బీఆర్‌ఎస్ నిజంగా బీజేపీలో విలీనం కావాలనుకున్నదా? లేక ఇది కేవలం రాజకీయ నాటకం మాత్రమేనా? అనే అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కేటీఆర్, సీఎం రమేష్ ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేయడం, భవిష్యత్తులో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అని, ఈ మాటల తూటాలు మాటలకే పరిమితమా? లేక రాజకీయ మలుపులకు కారణమవుతాయా? అన్నది చూడాల్సిన అవసరం ఉంది.