Home Page SliderNews AlertTelangana

మొబైల్‌ గేమ్‌ కోసం  36 లక్షలు ఖర్చు చేసిన బాలుడు

Share with

తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల సరైన పర్యవేక్షణ లేకపోతే దానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు.. పిల్లల పర్యవేక్షణ ఎందుకు ఉండాలో ఈ ఘటనే ఓ ఉదాహరణ. ఈ మధ్య మొబైల్‌ గేమ్‌ వ్యసనం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లోని అంబర్‌ పేటకు చెందిని 16 ఏళ్ల బాలుడు మొబైల్‌ గేమ్‌ కోసం అమ్మ ఖాతాలో ఉన్న రూ. 36 లక్షల రూపాయలను ఖర్చు చేసిన కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఫ్రీ ఫైర్‌ గేమింగ్‌ యాప్‌ను బాలుడు తొలుత తన తాత మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. అయితే గేమ్‌లో కొన్ని లెవల్స్‌ పూర్తి చేసిన తర్వాత, మరింత ముందుకు వెళ్ళాలంటే అప్పుడు కొంత డబ్బులు చెల్లించాలనే నోటిఫేకేషన్‌ వచ్చింది. దీంతో బాలుడు తొలుత తన తల్లి ఖాతా నుంచి రూ. 1,500 చెల్లించాడు. గేమ్‌లో మరింత ముందుకు వెళ్లే కొద్దీ ఆ బ్యాలన్స్‌ కూడా ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత మరో రూ. 10,000ను అమ్మ ఖాతా నుంచి చెల్లించాడు. గేమ్‌లో మరింత ముందుకు వెళుతున్న కొద్దీ ఏదో తెలియని మజా అతడికి అనిపించింది. దాంతో దాన్ని వదిలిపెట్టలేకపోయాడు.

అలా అమ్మకు తెలియకుండా రూ. 1.45 లక్షలు,  రూ. 2 లక్షల చొప్పున చెల్లించాడు. సాధారణంగా డబ్బులు డెబిట్‌ అయినప్పుడు కొన్ని సందర్భాల్లో ఖాతాదారులకు అలర్ట్‌ మేసేజ్‌లు వస్తుంటాయి. చాలా సందర్భాల్లో మెసేజ్‌లు రావు. ఆమె డబ్బులు డ్రా చేసుకుందామని బ్యాంక్‌కు వెళ్లినప్పుడు బ్యాంకు ఆఫీసర్‌ చెప్పిన సమాధానం విని షాక్‌కు గురైంది.  ఖాతాలో డబ్బుల్లేవని చెప్పారు. ఆమె ఖాతా నుంచి రూ. 27 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిపారు. తర్వాత సదరు బాలుడు మరో బ్యాంక్‌ ఖాతా నుంచి కూడా మరో 9 లక్షలకు ఖర్చు చేశాడు. దీంతో మొత్తం రూ. 36 లక్షలు ఖర్చు చేశాడు. మరణించిన తన భర్త కష్టార్జితం మొత్తం బ్యాంకు ఖాతాలో ఉందని, భర్త మరణ పరిహారం కూడా దానిలో కలసి ఉందని చెప్పి ఆమె వాపోయింది. బాలుడు ఇంటర్‌ చదువుతున్నాడు. దీనిపై ఆమె సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.