మండలిలో బొత్స v/s లోకేష్
శాసన మండలిలో మంగళవారం హంగామా నెలకొంది. వైసీపీ సభ్యులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై వాయిదా తీర్మానం తీసుకురావాలని పట్టుబడగా, మండలి ఛైర్మన్ తిరస్కరించారు. దీనిపై మండలిలో ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ సభ్యులు.. మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
లోకేష్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని బొత్స ధ్వజమెత్తారు. “మేం బకాయి పెట్టామంటూ మంత్రి లోకేష్ చెప్పడం అసత్యం. సభను తప్పుదోవ పట్టించడం సరైంది కాదు. చర్చకు మేము సిద్ధమే. సభలో సీనియర్, జూనియర్ అన్న తేడా ఉండదు.. ఎవరైనా సభా మర్యాదలు పాటించాలి. పరుష పదజాలం వాడకూడదు” అని బొత్స గట్టిగా ప్రశ్నించారు.
లోకేష్ వర్సెస్ మండలి ఛైర్మన్:
ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు మధ్య కూడా చర్చ జరిగింది . గత ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్ వర్కర్లకు అమలు చేసిన పథకం ఈ ప్రభుత్వం నిలిపివేసిందని, ఇప్పుడు వారికి మళ్లీ అమలు చేసే అవకాశం ఉందా? అని ఛైర్మన్ ప్రశ్నించారు. దీనిపై మంత్రి లోకేష్.. “మున్సిపాలిటీల్లో 12 వేలు , గ్రామీణ ప్రాంతాల్లో 10 వేల కంటే తక్కువ జీతం పొందుతున్న వారికి పథకం వర్తిస్తుంది” అని సమాధానం ఇచ్చారు.
అయితే, “మున్సిపాలిటీల్లో వేతనం 18 వేలుగా ఉన్నప్పుడు 12 వేల నిబంధన పెట్టడం ఏ విధంగా సరిపోతుంది?” అంటూ ఛైర్మన్ ప్రశ్నించగా, “పరిశీలిస్తాం” అని లోకేష్ సమాధానమిచ్చారు.
‘తల్లికి వందనం’పై విమర్శలు:
తదుపరి చర్చలో వైకేపీ ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, బొమ్మి ఇజ్రాయేలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “గత ప్రభుత్వం విద్యార్థుల కోసం అమ్మఒడి పథకాన్ని తెచ్చింది. ఈ ప్రభుత్వం దాన్ని కాపీ చేసి ‘తల్లికి వందనం’ పేరుతో అమలు చేస్తోంది. 67 లక్షల మందికి ఇస్తామని చెప్పి, 54 లక్షల మందికే ఇచ్చారు. మొదటి సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు.. రెండో సంవత్సరం అరకొరగా ఇచ్చారు. నిబంధనల పేరుతో అనర్హుల సంఖ్యను పెంచారు. కరెంట్ బిల్లు 300 దాటినా పథకం కట్ చేశారు” అంటూ మండిపడ్డారు.
పారిశ్రామిక రంగంపై వాదోపవాదం:
“పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలతో కోఆర్డినేషన్ సహజం. ఏ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంది. కానీ ఈ ప్రభుత్వం మాపై నిందలు వేయటానికె ప్రయత్నిస్తోంది. విశాఖను ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దాం, మా హయాంలోనే ఐటీ కంపెనీలు వచ్చాయి. శంకుస్థాపనలు జరిగే ప్రాజెక్టులు అన్నీ మా పాలనలోనే మొదలైనవే. లులూ కంపెనీ ఐదు మాల్స్ మూతపడ్డాయి.. అసలు దాని వర్త్ ఎంత? దానికి విజయవాడ ఆర్టీసీ స్థలం ఎందుకు ఇచ్చారు? ఆక్షన్‌లో పెట్టకుండా నేరుగా ఎలా ఇచ్చారు?” అంటూ బొత్స ప్రశ్నల వర్షం కురిపించారు.
స్టీల్ ప్లాంట్‌పై బొత్స వ్యాఖ్యలు:
విశాఖ స్టీల్ ప్లాంట్ అందరికీ సెంటిమెంటు అని బొత్స గుర్తుచేశారు. “ఇండస్ట్రీస్ మేం అభివృద్ధి చేశామని టీడీపీ చెబుతోంది. కానీ గత ఐదేళ్లలో పారిశ్రామిక రంగం పూర్తిగా విచ్ఛిన్నమైంది. మేమొచ్చి అభివృద్ధి చేశాం. విశాఖలో 2023లో జరిగిన సమ్మిట్‌కు ముఖేష్ అంబానీ, నవీన్ జిందాల్ వంటి పారిశ్రామికవేత్తలు వచ్చారు. మా ప్రభుత్వ విధానాలపై నమ్మకం ఉంచి 13 లక్షల కోట్ల ఎంవోయూలు అయ్యాయి . పరిశ్రమలు రావాలంటే వారికీ నమ్మకం కలగాలి” అని బొత్స హితవు పలికారు.
వాకౌట్ చేసిన వైసీపీ:
హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు. సభను వదిలి బయటకు వెళ్ళి నిరసన తెలిపారు.