Home Page SliderTelangana

ఇన్ ఫ్రంట్ దేరీజ్ క్రోకోడైల్ ఫెస్టివల్.. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీ జరిగేలా కనిపిస్తున్నాయ్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో పరిస్థితులు రోజు రోజుకు మారిపోతున్నాయ్. సీఎం కేసీఆర్ రెండు చోట్ల బరిలో నిలుచోండటంతో సీన్ ఆసక్తికరంగా మారుతోంది. అటు గజ్వేల్, ఇటు కామారెడ్డి రెండు చోట్లా పరిస్థితి సీఎం కేసీఆర్‌కు అంతగా సానుకూలంగా లేదన్న ప్రచారం ప్రత్యర్థుల నుంచి విన్పిస్తోంది. సీఎం కేసీఆర్‌పై పగ తీర్చుకునేందుకు గజ్వేల్‎లో ఈటల సిద్ధమవగా, కామారెడ్డిలో రేవంత్ రెడీ అవుతున్నారు. ఇద్దరు నేతలు ఇప్పటికే నియోజకవర్గాలను చుట్టేసి.. పరిస్థితులను అంచనా వేసుకుంటున్నారు. బలమైన కేసీఆర్‌ను ఢీకొట్టడమంటే ఆషామాషీ కాదని ఇద్దరి తెలుసు. కానీ కోరు కోరి ఇద్దరూ కేసీఆర్‌పై పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత, కేసీఆర్ తెలంగాణ ఐకాన్‌గా నిలిచారు. ఆయన చెప్పింది వేదంలా భావించే పరిస్థితి ఉండేది. కానీ రాను రాను పరిస్థితుల్లో మార్పు వస్తోంది. బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవుతాయన్న చందంగా సీఎం కేసీఆర్ ఇప్పుడు పార్టీని గెలిపించుకోవడం కోసం ఎంత కష్టపడాలో.. తాను గజ్వేల్, కామారెడ్డిలో రెండు చోట్ల గెలవడం కోసం కూడా అంతే కష్టపడాల్సిన పరిస్థితి. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ అనుకున్నవన్నీ సాఫీగా, స్మూత్‌గా జరిగిపోయాయి. కానీ వచ్చే రోజుల్లో అలా జరుగుతాయన్న గ్యారెంటీ ఏ మాత్రం కనిపించడం లేదు. మొత్తంగా సీఎం కేసీఆర్‌కు అటు గజ్వేల్, ఇటు కామారెడ్డిలోని గట్టి పోటీ మాత్రమే కాదు, గెలుపు సాధించడం కూడా అంతా వీజీ కాదన్న భావన వ్యక్తమవుతోంది.

కామారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కాదని, బరిలో దిగుతున్న సీఎం కేసీఆర్‌ను, పీసీసీ రేవంత్ రెడ్డి ఢీకొట్టబోతున్నారు. కామారెడ్డిలో ఇప్పటికే పోటీ రసవత్తరంగా మారింది. నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో మాంచి ఊపు తీసుకొచ్చారు. ఒకవేళ అక్కడ్నుంచి గంపా గోవర్ధన్ నిలుచున్నా.. ఆయన ఓడించేలా ఎదిగారు. కానీ కేసీఆర్ రావడంతో సీన్ మారింది. ఇప్పటికే కామారెడ్డి నుంచి బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి వెంకటరామి రెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని నియోజకవర్గ ఓటర్లను కోరుతున్నారు. స్వతహాగా కామారెడ్డిలో బీజేపీకి బలం కూడా ఉండటంతో ఆయన గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు. మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ బరిలో దిగడంతో సీన్ మొత్తం చేంజ్ అవుతోంది. మొత్తంగా అటు బీజేపీ అభ్యర్థి కూడా భారీగా ఓట్లను చీల్చే అవకాశం కన్పిస్తోంది. దీంతో నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ జరిగే అవకాశం ఉంది.

ఇక అదే సమయంలో సీఎం కేసీఆర్‌ను ఓడించి తీరి తన పంతాన్ని నెగ్గించుకోవాలని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ భావిస్తున్నారు. 20 ఏళ్లు కేసీఆర్‌ను నమ్ముకొని రాజకీయాలు చేసిన తనను కేసీఆర్ వంచించారని, అభాసుపాలు చేశారని, రాజకీయంగా చంపేయాలని చూశారని ఆరోపించిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ గడ్డపై గెలిచి సత్తా చాటారు. తనను ఓడించడానికి సామ, భేద, దాన, దండోయాపాలతో ఇరుకునపెట్టిన కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే ఓడిస్తానని ఆనాడే ఈటల రాజేందర్ ప్రకటించారు. తాజాగా కేసీఆర్‌పై పోటీ చేసి గెలిచేందుకు తనకు బీజేపీ అవకాశం ఇచ్చిందని భావిస్తున్న ఈటల, ఎట్టి పరిస్థితుల్లో గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించి తీరుతానంటున్నారు. బడుగు బలహీన వర్గాల అండతో గజ్వేల్‌లో గెలుపు తనదేనంటున్నారు. గజ్వేల్‌లో బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందులోనూ ముదిరాజ్ సామాజికవర్గ ఓటర్లు మూడో వంతు ఉన్నారన్న అభిప్రాయం ఉంది. వచ్చే ఎన్నికల్లో అటు ముదిరాజ్‌లు, ఇటు రెడ్లు వన్ సైడ్ ఓటింగ్ చేస్తే తన గెలుపు నల్లేరుపై నడకన్న భావన ఆయనలో ఉంది. గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ రెండు సార్లు గెలవడం, నియోజకవర్గంలో ప్రజలతో పెద్దగా సంబంధాలు లేకపోవడం ప్రతిబంధంగా మారుతోంది.

మొత్తంగా సీఎం కేసీఆర్ అనుకున్నది ఒకటే అయింది అన్నట్టుగా కనిపిస్తోంది. కేసీఆర్ ఒకవేళ, ఒక్క గజ్వేల్ నుంచే పోటీ చేసి ఉంటే, గెలుపు నల్లేరుపై నడకలా సాగేది. కానీ ఆయన కామారెడ్డిలో కూడా పోటీ చేయాలనుకోవడం మొత్తం సిచ్యువేషన్‌ను టఫ్ చేస్తున్నాయ్. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి గెలిస్తే, కామారెడ్డిలో రాజీనామా చేస్తారన్న ప్రచారం కూడా ఉంది. ఐతే గజ్వేల్ మాత్రం, కేసీఆర్ కామారెడ్డిలో ఉంచుకుంటారని, గజ్వేల్ లో రాజీనామా చేస్తారన్న ప్రచారాన్ని స్థానికులు విశ్వసిస్తున్నారు. దీంతో కేసీఆర్ రెండు చోట్ల ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనేలా సీన్ కన్పిస్తోంది. కేసీఆర్ రెండు చోట్లా గెలవాలని భావిస్తుంటే… రెండు చోట్లా ఓడించాలని అటు రాజేందర్, ఇటు రేవంత్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.