సామాన్య పౌరులపై బాంబులు..మిలటరీ అపశృతి
దక్షిణ కొరియా మిలటరీ విన్యాసాలలో అపశృతి చోటు చేసుకుంది. వైమానిక దళం చేస్తున్న విన్యాసాలలో భాగంగా ప్రమాదవశాత్తూ 8 బాంబులను సామాన్య పౌరులపై ప్రయోగించారు. కేఎఫ్-16 అనే యుద్ధవిమానం గురువారం ఉదయం నిర్దేశించిన ఫైరింగ్ రేంజ్‌లో కాకుండా వేరే ప్రదేశంలో ఎంకే-82 బాంబులను జారవిడిచింది. ఈ ఘటనలో 8 మంది గాయపడినట్లు సమాచారం. ఒక నివాసం కూడా పాక్షికంగా దెబ్బతింది. తమ నివాస ప్రదేశాలకు దగ్గరలో మిలటరీ విన్యాసాలు, ట్రైనింగ్ గ్రౌండ్స్ ఉండడంతో అక్కడి పౌరులు భయభ్రాంతులవుతున్నారు. చాలాకాలంగా వాటిని అక్కడ నుండి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన అధికారులు ఈ ఘటనపై విచారణ కమిటీ వేస్తున్నామని, ప్రమాదం జరగడానికి కారణాలు అన్వేషిస్తున్నామని తెలియజేశారు. గాయపడిన వారికి సహాయం అందిస్తున్నామని అండగా ఉంటామని తెలియజేశారు.