విమానంలో బాంబు ..8 గంటల వృధా ప్రయాణం ..
ముంబయి నుండి న్యూయార్క్ ప్రయాణమైన బోయింగ్ 777 ఎయిర్ ఇండియా విమానం 8 గంటల ప్రయాణం అనంతరం తిరిగి ముంబయికి రావడంతో ప్రయాణికులు అందరూ కంగారు పడ్డారు. విమానం ఆగిన తర్వాత అధికారులు వారినందరినీ దించేసి, తనిఖీలు చేయడంతో ఆందోళనకు గురయ్యారు. విషయమేమిటంటే విమానంలో బాంబు ఉందంటూ వారికి సమాచారం రావడమే. అయితే బాంబు స్క్వాడ్ తనిఖీల అనంతరం ఈ సమాచారం అబద్దమే అని తేలింది. ఈ విమానంలో 303 మంది ప్రయాణికులు, 19 మంది ఎయిర్ ఇండియా సిబ్బంది ఉన్నారు. 15 గంటలలో న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్ పోర్టుకు చేరుకోవల్సిన విమానం, బాంబు బెదిరింపులతో అజర్ బైజాన్ దాకా వెళ్లి తిరిగి వచ్చింది. చివరకు దీనిని రద్దు చేసి, మంగళవారం ఉదయం 5 గంటలకు రీషెడ్యూల్ చేశారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పి, వారికి ప్రయాణంలో అన్ని వసతులు కల్పిస్తామని తెలిపింది. వారి భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది.