కోర్టులో లొంగిపోయిన బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్
2018 చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటి అమీషా పటేల్ శనివారం రాంచీ సివిల్ కోర్టులో లొంగిపోయింది. సీనియర్ డివిజన్ న్యాయమూర్తి డిఎన్ శుక్లా ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ జూన్ 21న మళ్లీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని కోరారు. జార్ఖండ్‌కు చెందిన సినీ నిర్మాత అజయ్ కుమార్ సింగ్ నటిపై మోసం, చెక్ బౌన్స్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోర్టు అమీషా పటేల్‌కు పలుమార్లు సమన్లు జారీ చేసింది. కానీ ఆమె హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆమెకు వారెంట్ జారీ చేసినట్టు ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది విజయ లక్ష్మీ శ్రీవాస్తవ తెలిపారు. “దేశీ మ్యాజిక్” అనే సినిమా నిర్మాణం కోసం హీరోయిన్‌కు నిర్మాత అజయ్ కుమార్ సింగ్ రెండున్నర కోట్లు ఆమె ఎకౌంట్‌కు ట్రాన్సఫర్ చేశాడు. అయితే ఆమె సినిమాకు దూరంగా ఉన్నారు. 2.50 కోట్ల చెక్కు హీరోయిన్ తిరిగి ఇచ్చినా, బౌన్స్ కావడంతో, కేసు నమోదైంది.

సన్నీ డియోల్‌తో కలిసి ‘గదర్ 2’తో మరోసారి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అమీషా పటేల్ లొంగిపోయే వార్త వచ్చింది. జార్ఖండ్‌లోని ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లకు సంబంధించి పటేల్‌పై మోసం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన నేరానికి సంబంధించిన క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ఆగస్టు 2022లో సుప్రీంకోర్టు నిలిపివేసింది. అయితే, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 138 (చెక్ బౌన్స్) కింద శిక్షార్హమైన నేరాలకు సంబంధించిన ప్రొసీడింగ్‌లు చట్టం ప్రకారం కొనసాగవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. జార్ఖండ్ హైకోర్టు మే 5, 2022 నాటి ఉత్తర్వుపై పటేల్ దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీం కోర్టు ఆదేశం వచ్చింది. ఫిర్యాదుకు సంబంధించి రాంచీలోని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని రద్దు చేసి, కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.