తెలంగాణలో బీజేపీ గెలిచే సీట్లు!?
లోక్ సభ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ వ్యూహాలు
గ్రేటర్ హైదరాబాద్‌పై ఫోకస్ పెంచుతున్న పార్టీ
4 నియోజకవర్గాల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో అడుగులు
సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్లపై దృష్టి
త్వరలోనే అభ్యర్థుల్ని ఖరారు చేయాలన్న ఉద్దేశం
గెలిచే సీట్లపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలని నిర్ణయం
తెలంగాణలో బీజేపీ గెలిచే సీట్లు ఎన్ని? కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్సెపెక్ట్ చేస్తున్నట్టుగా 10కి పైగా స్థానాల్లో కాషాయ జెండా రెపరెపలాడుతుందా? అంటే అవుననే సంకేతాలు ఇప్పుడు అందుతున్నాయ్. అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన బీజేపీ, 14 శాతం ఓట్లను రాబట్టి 8 సీట్లలో విజయం సాధించింది. ఇదే ఊపును లోక్ సభ ఎన్నికల్లో కొనసాగిస్తే భారీగా సీట్లను గెలుచుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని పార్టీ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగనున్న సాధారణ ఎన్నికల సంగ్రామంలో తెలంగాణలో విజయం సాధించేందుకు బీజేపీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఓవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని ఆరాటపడుతోంది. అయితే లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్లు స్పష్టమైన తేడా చూపించడంతో ఈసారి ఎన్నికల్లో బీజేపీకి అడ్వాంటేజ్ పొజిషన్ లభిస్తోందన్న భావన వ్యక్తమవుతోంది. సహజంగా మోడీకి ఉన్న క్రేజ్ బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి గల్లీలో ఎవరన్నా సరే ఢిల్లీలో మోడీ ఉండాలి అన్న నినాదం ఈసారి తెలంగాణ బీజేపీ నేతలు తీసుకుంటున్నారు. ఈ సిద్ధాంతం ఆధారంగా, తెలంగాణలో బీజేపీకి గరిష్టంగా పదికి పైగా లోక్‌సభ స్థానాలు రావచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు.

వచ్చే లోకసభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడం ద్వారా విజయం సాధించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బ్లూ ప్రింట్ తయారుచేసుకున్న కమలదళం దక్షిణాదిలో కర్ణాటక తర్వాత మెయిన్ ఫోకస్ తెలంగాణ పైనే పెడుతోంది. కర్ణాటకలో జేడిఎస్‌తో పొత్తు ద్వారా ఎన్నికల్లో కొట్లాడాలని భావిస్తున్న బీజేపీ, తెలంగాణలో మాత్రం సొంతంగానే పోటీ చేయాలని… తక్కువలో తక్కువ సగం సీట్లు అంటే 17లో 8 స్థానాల్లో సునాయాశంగా విజయం సాధించవచ్చని భావిస్తోంది. అదే దీమాను బీజేపీ స్థానిక నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పలు సర్వేలు సైతం బీజేపీ కీలక స్థానాల్లో విజయం ఖాయమన్న సందేశం ఇవ్వడంతో… నేతలు పోటీ చేసేందుకు పోటీపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకే ఓటేస్తామంటూ ఓటర్లు నుంచి కూడా రెస్పాన్స్ రావడంతో… ఈ ఎన్నికల్లో బీజేపీకి అడ్వాంటేజ్ పొజిషన్ లభిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ లేదంటే కింగ్ మేకర్ కావాలన్న లక్ష్యంగా పనిచేసిన కాషాయదళం ఇప్పుడు పది స్థానాలను గెలవడంపై ఫోకస్ పెడుతోంది. ఉన్న ఆప్షన్స్ అన్ని ఒక్కొక్కటిగా పరిశీలిస్తోంది. 4 సిట్టింగ్ ఎంపీ స్థానాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్‌తోపాటుగా… ఈసారి ఎన్నికల్లో మల్కాజ్‌గిరి, మెదక్, జహీరాబాద్, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో విజయం సాధించేలా వ్యూహాలు రచించాలని పార్టీ భావిస్తోంది.

అయితే కాంగ్రెస్ పార్టీ అధికార బలం, ఆ పార్టీకి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కీలక స్థానాల్లో గెలిచేందుకు వీలు కలిగిస్తోందన్న అభిప్రాయం ఉంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీని డిఫెన్స్‌లోకి నెట్టేసి, కీలక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డితోసహా, కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీకి ఏ విధంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందో అదే విధంగా లోక్ సభకు సీట్ల కేటాయింపు చేయాలని వారు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన డామేజ్‌ను లోక్ సభ ఎన్నికల్లోనూ పూడ్చుకొని.. ఆ తర్వాత జరిగే గ్రేటర్ ఎన్నికల్లో జెండా ఎగురేయాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ నాయకులు లోక్ సభపై ఎక్కువగా ఫోకస్ పెంచారు. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని తెలంగాణలో పోటీ చేయించి ఆమెకు గిఫ్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకగణం తహతహలాడుతోంది. నాడు ఇందిరా మెదక్ నుంచి పోటీ చేయగా, ఇప్పుడు సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయించాలని నేతలు యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ నిలబడే అవకాశమంటూ వార్తలు వచ్చినప్పటికీ.. బీజేపీ పెద్దల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు రాలేదు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా గత కొంతకాలంగా విశ్వప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణలో మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న లోక్ సభ స్థానాల్లో బీజేపీ ఇప్పుడు మెయిన్ ఫోకస్ పెంచింది. హైదరాబాద్ మినహా మిగతా అన్ని సీట్లను గెలుచుకోవాలని పార్టీ వ్యూహం రచిస్తోంది. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల మూడు సీట్లలోనూ… విజయం సాధించి తీరాలని లక్ష్యంగా పెట్టుకోంది. వీటితోపాటు ఎస్సీ నియోజకవర్గాలైన పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాలతోపాటుగా, ఆదిలాబాద్ కాకుండా ఉన్న మరో ఎస్టీ నియోజకవర్గం మహబూబాబాద్‌పై అనుసరించాల్సిన వ్యూహాన్ని పార్టీ మధిస్తోంది. సిట్టింగ్ ఎంపీలు నాలుగురు ఈసారి ఎన్నికల్లో గెలవడం ఖాయమన్న అభిప్రాయంతో ఉన్న బీజేపీ… పార్టీకి పెద్దగా ప్రాచుర్యం లేని ప్రాంతాల్లో కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తోందన్న విశ్వాసంతో ఉంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాలు సాధిస్తే ఆ తర్వాత రాజకీయాలు ఎలా మారుతాయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదని కమలనాధలు దీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లలో విజయం సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. ఏ ఒక్క సీటును కూడా వదులుకోరాదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకు తగినట్టుగా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ముఖ్యంగా కర్ణాటక-మహారాష్ట్ర బోర్డర్ ఉన్న ప్రాంతాల్లో బీజేపీ గెలుపు సునాయసమన్న భావన బీజేపీ పెద్దల నుంచి వ్యక్తమవుతోంది.