Home Page SliderTelangana

తెలంగాణలో బీజేపీ 12 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది: అమిత్ షా

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 12 స్థానాల్లో గెలుస్తోందని దీమా వ్యక్తం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. సికింద్రాబాద్ లో బీజేపీ వారియర్స్ సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. దేశంలో అవినీతి అంతమే బీజేపీ లక్ష్యమన్నారు. మోదీ నేతృత్వంలో దేశం సురక్షితంగా ఉందని, హాట్రిక్ గెలుపు ఖాయమన్నారు షా. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ మూడు పార్టీలు ఒకటేనన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు, మహిళలు, యువత, నిరుపేదలు అందరూ కూడా మోదీని గెలిపిస్తామంటున్నారన్నారు. దేశంలో మోదీ, మోదీ అని యువత నినదిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లోనూ బీజేపీదే అధికారమని అమిత్ షా చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికీ బీజేపీ కార్యక్రమాలు, విజయాలను తెలపాలన్నారు. మూడోసారి నరేంద్రమోదీని ప్రధానిగా చూడాలని ప్రజలు భావిస్తున్నారన్నారు.

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయే కు 400 సీట్లు దాటతాయని… అందులో, తెలంగాణ నుంచి 12కు పైగా ఉండాలన్నారు. తెలంగాణ ప్రజల మద్దతుతో ఢిల్లీలో మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. అవినీతిరహిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా, మోదీజీ గత పదేళ్లుగా సుస్థిర పరిపాలన అందించారన్నారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతలపై లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయి.. కానీ, ప్రధాని మోడీపై ఎలాంటి అవినీతి మరక లేదన్నారు. మోదీ మరోసారి ప్రధానిగా వస్తే, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​ను తీర్చిదిద్దుతారన్నారు. అన్ని రంగాల్లో ఇండియా అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందన్నారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్ల పాలనలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. దేశ ప్రజలు 500 ఏళ్లుగా ఎదురుచూసిన రామమందిరాన్ని నిర్మించారన్నారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్​, మజ్లిస్‌ ఒక్కటే. ఆ మూడు పార్టీలు వారసత్వ పార్టీలేనని… మజ్లిస్‌ అజెండాతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. ఆ మూడు పార్టీల జెండాలు వేరైనా.. అజెండా ఒక్కటేనని విమర్శించారు. ఎంఐఎం చేతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కీలుబొమ్మలన్నారు. కుటుంబ పార్టీలతో ఎప్పటికీ ప్రజా శ్రేయస్సు సాధ్యం కాదన్నారు. ఆ పార్టీలు వారి కుటుంబాల అభివృద్ధి కోసం ఎంతటి అవినీతికైనా సిద్ధపడుతాయన్నారు.

త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అవినీతి జాబితా పంపిస్తా.. ఆ జాబితాపై సమాధానం చెప్పిన తర్వాతే బీజేపీ పై విమర్శలు చేయాలన్నారు. యురి ఘటన జరిగిన 10 రోజుల తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. పది రోజుల్లోనే పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్‌ చేసి ముష్కరులను మట్టుబెట్టామన్నారు. భారత సైనికులపై దాడిని మర్చిపోయేందుకు ఇది మన్మోహన్‌ ప్రభుత్వం కాదన్నారు. మోదీ మూడో టర్మ్‌లో దేశం ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు.