బీజేపీ, టీఆర్‌ఎస్ పోస్టర్లు, లేఖల యుద్ధం
మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని కంకణం కట్టుకున్న టీఆర్‌ఎస్, బీజేపీ ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు విమర్శలు-ప్రతి విమర్శలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు, పోస్టర్లు-లేఖలతో ఓటర్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోస్టర్ల ప్రచారం ప్రారంభిస్తే.. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖలతో కౌంటర్ ఇస్తూ వినూత్న ప్రచారానికి తెర లేపారు.

కేసీఆర్ ఝూటా మాటలు..
‘కేసీఆర్ ఝూటా మాటల’ పోస్టర్‌ను బండి సంజయ్ ఇటీవల విడుదల చేశారు. తాను అవసరమైతే తల నరుక్కుంటానని.. ఆడిన మాటను మాత్రం తప్పబోనని కేసీఆర్ చెప్పిన విషయాన్ని బండి సంజయ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దళితులకు సీఎం పదవి, మూడెకరాల భూమి, అంబేడ్కర్‌కు 125 అడుగుల విగ్రహం కడతానని మోసం చేశారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ ఇవ్వకుండా మాట తప్పారని ఆరోపించారు. రాష్ట్ర నిరుద్యోగ యువతకు రూ.3,106 నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో అమరవీరుల కుటుంబాలకు భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, కుటుంబానికో ఉద్యోగం, రూ.10 లక్షల ఆర్థిక సాయం ఇస్తానన్న కేసీఆర్ ఎక్కడున్నారని నిలదీశారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానన్న వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య ఏమైందన్నారు. తన పోస్టర్‌ను ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్ మొదలైన సోషల్ మీడియాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ శ్రేణులను కోరారు.

నమో అంటే నమ్మించి మోసం చేసేవారు..
‘నమో అంటే నమ్మించి మోసం చేసేవారు’ అంటూ మోదీపై కేటీఆర్ విడుదల చేసిన బహిరంగ లేఖలో ప్రధానికి సూటి ప్రశ్నలు సంధించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తానన్న ప్రధాని ఎనిమిదేళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ఏటా 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేని కేంద్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఒకే రోజు 75 వేల ఉద్యోగాలిస్తూ రోజ్‌గార్ మేళా పేరుతో యువతను దగా చేసిందన్నారు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలిచ్చారో కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2.24 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని.. ప్రైవేటు రంగంలో 16.5 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సైతం కల్పించామని కేటీఆర్ విడుదల చేసిన లేఖలో ప్రస్తావించారు. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణ పరిస్థితులను, నిరుద్యోగ సమస్యలను, రూపాయి పతనాన్ని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టలేక ఆ దేశ ప్రధాని 45 రోజుల్లోనే రాజీనామా చేశారని.. భారత్‌లోనూ ఆ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని.. ప్రధాని మోదీ ఎప్పుడు రాజీనామా చేస్తారని కేటీఆర్ నిలదీశారు. కేంద్రంపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. మునుగోడులో విజయమే ఏకైక లక్ష్యంతో చేస్తున్న ఈ యుద్ధాన్ని ఓటర్లు మౌన ప్రేక్షకుల్లా చూస్తున్నారు.