Home Page SliderTelangana

BJP ఎమ్మెల్యే రఘునందన్ అరెస్ట్

తెలంగాణాలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఇటీవల జరిగిన TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం అనే చెప్పాలి. ఈ పేపర్ లీకేజీ తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అంతేకాకుండా నిరుద్యోగులతో కలిసి ఆందోళన బాట చేపట్టాయి. కాగా వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ప్రతిపక్షాల నాయకులు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. అయితే తాజాగా 10 వతరగతి పరీక్ష పేపర్ కూడా లీక్ అవడంతో ప్రతిపక్షాల ఆందోళనలు మిన్నంటాయి.  దీంతో తెలంగాణాలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ పేపర్ లీకేజీల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ..ఆందోళనకు దిగారు. దీంతో బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అతని అరెస్ట్‌ను అడ్డుకునేందుకు కార్యకర్తలు యత్నించారు. బండి సంజయ్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే బండి సంజయ్‌ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పోలీసులను ప్రశ్నించారు. కాగా పోలీసులు రఘునందన్ కూడా అదుపులోకి తీసుకున్నారు. రఘునందన్‌ను చొక్కా పట్టి బలవంతంగా లాగి పోలీస్ వాహనం వద్దకు తీసుకువెళ్లారు. తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని రఘునందన్ ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు,రఘునందన్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.  పోలీసులు మఫ్టీలో దురుసుగా ప్రవర్తిస్తారా? అంటూ పోలీసుల తీరుపై రఘునందన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.