హైకమాండ్ నిర్ణయంపై బీజేపీ నేతల అసంతృప్తి
బీజేపీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులపై పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడి భాద్యత నుండి బండి సంజయ్‌ను దూరం చేసి, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి అప్పగించారు. అంతేకాదు, బండి సంజయ్‌కు ఇంతవరకూ ఏ పదవినీ ప్రకటించలేదు. కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్న ఈటల రాజేందర్‌ను బుజ్జగించే ప్రయత్నంగా ఆయనను ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. బీజేపీ అధ్యక్ష పదవి నుండి నిష్క్రమిస్తున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీకి, అగ్రనేతలకు, కార్యకర్తలకు, తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ నియమామకాలపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఒక వైపు పార్టీ కార్యక్రమాలు సక్రమంగా నెరవేరుస్తున్నందుకు ప్రశంసిస్తూనే పదవి నుండి తప్పించడంతో చాలా ఆవేదనకు గురయ్యారని సమాచారం. మరోవైపు కిషన్ రెడ్డి కూడా ఈ నియామకంపై ఏమీ స్పందించలేదు. ఆయనకు కూడా కేంద్రమంత్రి పదవిని వదులుకుని, రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా వ్యవహరించడం ఏమీ ఇష్టం లేదని బీజేపీ వర్గాలు భావిస్తున్నారు.

