TSలో BJP + JANASENA: కిషన్‌రెడ్డి, పవన్‌కళ్యాణ్‌లతో అమిత్‌షా
వచ్చే నవంబర్ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సూచించారు.
రేపటి లోపు సీట్ల సర్దుబాటుపై నిర్ణయానికి రావాలని సూచించిన అమిత్‌షా.. 33 సీట్లు కోరుతున్న జనసేన పార్టీ.
ఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సూచన. ఇప్పటికే ఈ అంశంపై ప్రాథమిక అవగాహనకు వచ్చిన ఇరుపార్టీల నేతలు బుధవారం సాయంత్రం అమిత్‌షాను కలిసి సుమారు 40 నిమిషాల పాటు చర్చలు జరిపారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. తాను శుక్రవారం హైదరాబాద్‌కు వస్తున్నానని, ఆ లోపు సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని వారికి అమిత్‌షా సూచించినట్లు తెలిసింది. అందుకు కిషన్‌రెడ్డి, పవన్‌కళ్యాణ్ అంగీకరించారు. అంతర్గతంగా పార్టీల్లో చర్చించుకొని ఎవరెక్కడ పోటీ చేయాలనుకుంటున్నదీ చెబుతామని వారు చెప్పినట్లు సమాచారం. జనసేన నాయకులు ఉమ్మడి హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో 33 సీట్లు అడుగుతున్నట్లు తెలిసింది.
ఈ సమావేశంలో అమిత్‌షా, పవన్‌కళ్యాణ్‌లు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల గురించి హోంమంత్రికి పవన్‌కళ్యాణ్ వివరించగా.. ఆంధ్రప్రదేశ్‌కు అన్నిరకాలుగా అనుకూలంగా ఉంటామని, రాష్ట్రాభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని, కష్టపడి పనిచేయాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో జనసేన కలిసి వెళ్తున్న విషయం అమిత్‌షా వద్ద చర్చకు రాలేదని, తెలంగాణలో కలిసి పనిచేసే విషయం మాత్రమే చర్చకు వచ్చినట్లు తెలిసింది. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కిషన్‌రెడ్డి, పవన్ కళ్యాణ్‌లు భేటీ కావాలనుకున్నా ఆయన మరో సమావేశంలో ఉండటంతో కలవలేకపోయారు. అమిత్ షా భేటీ తర్వాత ఇద్దరు మీడియాతో మాట్లాడకుండానే నేరుగా విమానాశ్రయానికి వెళ్లిపోయారు. అంతకుముందు కిషన్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ.. గతంలో పవన్ కళ్యాణ్‌తో హైదరాబాద్‌లో ప్రాథమికంగా చర్చించామని చెప్పారు. పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడదామని పవన్ కళ్యాణ్ అనడం వల్లే ఇక్కడికి ఆహ్వానించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో తెదేపాతో కలిసి వెళ్లాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినందు వల్ల తెలంగాణలోనూ తెదేపా కలిసివస్తుందా అన్నప్రశ్నకు కిషన్‌రెడ్డి బదులిస్తూ జనసేన ఒక్కటే ఎన్‌డీఏ భాగస్వామి. అంతవరకే మా చర్చలు ఉంటాయి అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన వైఖరి ఎలా ఉన్నా, తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీచేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. జనసేన ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. నవంబర్ 1న కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించి రెండో జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా మారుతుందనుకున్న బీజేపీ డీలాపడటం వల్లే పార్టీ మారే పరిస్థితి వచ్చిందన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. తమలాంటి పెద్ద పార్టీలోకి ఇలాంటివారు ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారని.. రాజగోపాల్ రెడ్డి బయటికెళ్లడానికి ఏదో కారణాన్ని వెతుక్కున్నారని అభిప్రాయపడ్డారు. బీజేపీ తొలి జాబితాలో తన పేరు లేకపోవడం వల్లే ఆయన బయటికెళ్లారన్న వాదనలను తోసిపుచ్చారు. దానికి తాము బాధ్యులం ఎలా అవుతామన్నారు.