మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసే పార్టీ బీజేపీ
జనగామ జనసంద్రంగా మారింది. జై మోడీ, జై జై మోడీ, జై అమిత్‌షా నినాదాలు హోరెత్తాయి. ఆటపాటలతో కళాకారులు సందడి చేశారు. కాషాయ జెండాలతో యువత కదం తొక్కింది. అగ్రనేత అమిత్‌షా జనగామ సకల జనుల విజయ సంకల్ప యాత్ర సభలో పాల్గొన్నారు. తన ప్రసంగంతో భారీగా హాజరైన ప్రజలను ఆకట్టుకున్నారు. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి అభ్యర్థులు ఆరుట్ల దశమంతరెడ్డి, లేగ రామ్మోహన్‌రెడ్డి, గుండె విజయరామారావుల పేర్లు చెబుతూ వారిని గెలిపించాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు అమిత్‌షా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ ఎన్నికలు కేవలం తమ అభ్యర్థులను గెలిపించేవి కావని, దేశ, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేలా ఉంటాయని అమిత్‌షా అభివర్ణించారు.

