త్రిపురలో సీట్లు తగ్గినా బీజేపీదే అధికారం
ఉత్కంఠగా సాగుతున్న ఓటింగ్ ట్రెండ్స్ తర్వాత త్రిపురలో బీజేపీ కొలుకున్నట్టుగా కన్పిస్తోంది. త్రిపురలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. తొలుత దూసుకుపోయిన బీజేపీ నేతృత్వంలోని కూటమి సంఖ్య సగం కంటే దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 60 స్థానాలకు గానూ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రెండు పార్టీలు అధికార పార్టీకి గట్టి సవాల్‌గా నిలిచాయి. మాజీ రాజ ప్రద్యోత్ మాణిక్య దెబ్బర్మ నేతృత్వంలోని తిప్ర మోత ఈ ఎన్నికల్లో సంచలనం సృష్టిస్తోంది. సర్వే రిపోర్టులకు భిన్నంగా ఆ పార్టీ ప్రస్తుతం 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

త్రిపురలో మొత్తంగా బీజేపీ అధికారంలో కొనసాగవచ్చు. కాకుంటే గతంలో వచ్చిన సీట్లలా పరిస్థితి ఇప్పుడు లేదు. 2018 రాష్ట్ర ఎన్నికలలో 35 ఏళ్ల పాలన తర్వాత సీపీఎంను గద్దె దించి బీజేపీ 36 స్థానాలను కైవసం చేసుకుంది. దాని మిత్రపక్షమైన IPFTతో, ఈ సంఖ్య 44గా ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, వామపక్షాల ఓట్ల శాతం బిజెపి కంటే కేవలం 1 శాతం తక్కువ. కాకుంటే ఆ పార్టీ కేవలం 16 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. గిరిజన పార్టీ, ఇండిజినస్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర IPFTతో కలిసి BJP పోటీ చేస్తోంది. అయితే గతసారిలా మిత్రపక్షం సహాయం అవసరం లేకుండా తాము ఎన్నికల్లో విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి మాణిక్ సాహా చెప్పారు.

ఐతే టిప్ర మోతా పార్టీతో బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఆదివాసీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలలో ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌తో.. సీపీఎం త్రిపురలో పొత్తుతో బరిలోకి దిగింది. గత ఎన్నికల్లో గెలిచిన సీట్లను నిలబెట్టుకునేందుకు శతధా ప్రయత్నిస్తోంది. గత ఐదేళ్లలో, రెండు పార్టీలు భారీ స్థాయిలో మద్దతును కోల్పోయాయి. రాష్ట్రంలోని 60 స్థానాల్లో సీపీఎం 47 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌కు 13 మిగిలాయి.