తెలంగాణాలో బీజేపీదే అధికారం
రానున్న రోజుల్లో తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. మునుగోడు ఉపఎన్నికతో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలనకు అంతం ప్రారంభమవుతుందన్నారు. ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజగోపాల్‌రెడ్డి మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని సతీసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో బీజేపీ గెలుస్తుందని.. కేసీఆర్ పతనానికి అక్కడి నుంచే ఆరంభమని జోస్యం చెప్పారు. ఈ ఉపఎన్నిక రాష్ట్ర భవిష్యత్తునే మారుస్తుందని.. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం జరుగుతున్న ఎన్నిక అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ కుటుంబ పాలనకు తెర దించాలని మునుగోడు నియోజకవర్గ ప్రజలను కోరారు. మునుగోడు ప్రజలే తనకు దేవుళ్లని, వారి తీర్పును శిరసావహిస్తానని తెలిపారు.