ఆ సీట్లపై బీజేపీ గురి.. తెలంగాణలో కీలకంగా అభ్యర్థుల ఎంపిక
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కీలక శక్తిగా మారాలని భావిస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగా కసరత్తు తీవ్రతరం చేస్తోంది. అభ్యర్థుల ఎంపికతోనే పార్టీ విజయం సాధ్యమని భావిస్తున్న బీజేపీ పెద్దలు సీనియర్ నేతలను బరిలోకి దించాలని భావిస్తోంది. ఇప్పటికే ముఖ్యమైన స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసిన పార్టీ సీనియర్ల ద్వారా విజయాన్ని దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపారు. గెలుపు ఖాయమనుకున్న నేతలను ఎన్నికల బరిలో దించాలని పార్టీ యోచిస్తోంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంబర్ పేట నుంచి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి పోటీ చేయనుండగా, ధర్మపురి అర్వింద్ కోరుట్ల నుంచి, డీకే అరుణ గద్వాల నుంచి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, దుబ్బాక నుంచి రఘునందన్ రావు, జహీరాబాద్ నుంచి రాజాసింగ్, శేరిలింగంపల్లి నుంచి గజ్జల యోగానంద్, తాండూర్ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డి, ఎల్బీనగర్ నుంచి సామారంగారెడ్డి, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి ఎన్ రామచందర్ రావు, ఆందోల్ నుంచి మోహన్ బాబు, కల్వకుర్తి నుంచి తల్లోజు ఆచారి బరిలో దిగడం ఖాయంగా కన్పిస్తోంది. అభ్యర్థుల మొదటి జాబితా ఈ రాత్రికి విడుదలయ్యే అవకాశం ఉంది.

