NewsTelangana

రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఖాయం

భైంసా పేరును ‘మహిశా’గా మారుస్తాం

భైంసాను దత్తత తీసుకుంటా: బండి సంజయ్‌

వెయ్యి మంది కేసీఆర్‌లూ మోదీని ఆపలేరు: కిషన్‌ రెడ్డి

తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే భైంసా పేరును ‘మహిశా’గా మారుస్తామన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం భైంసాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి రాగానే భైంసాను దత్తత తీసుకుంటామని.. హిందూ వాహిని కార్యకర్తలపై పెట్టిన పీడీ యాక్ట్‌ను కొట్టేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని, ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.

కేసీఆర్‌ను మళ్లీ గెలిపిస్తే మరో రూ.5 లక్షల కోట్ల అప్పు చేస్తారు..

మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అప్పులపాలు చేశారని.. ఆయనను మళ్లీ గెలిపిస్తే మరో రూ.5 లక్షల కోట్ల అప్పు చేస్తారని బండి సంజయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే మజ్లిస్‌ పార్టీ నేతలు ఎక్కడికైనా వెళ్లొచ్చు.. దేశం కోసం, హిందువుల సంక్షేమం కోసం పాటుపడుతున్న బీజేపీ నేతలను భైంసాలోకి రాకుండా అడ్డుకుంటారా..? అని ప్రశ్నించారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో కాంట్రాక్టర్‌ కేసీఆర్‌ బంధువు కావడం వల్లే అక్కడి విద్యార్థులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

కేసీఆర్‌ ఒక్క ఎంపీ సీటైనా గెలుస్తారా..?

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని.. వెయ్యి మంది కేసీఆర్‌లు, వెయ్యి మంది ఒవైసీలు వచ్చినా అడ్డుకోలేరని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ పతనం ప్రారంభమైందని.. రానున్న ఎన్నికల్లో ఆయన ఒక్క ఎంపీ సీటైనా గెలుస్తారా..? అని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ అవినీతి, అక్రమాలపై దర్యాప్తు చేసి.. జైల్లో వేస్తామని చెప్పారు. ఈ సభలో బీజేపీ సీనియర్‌ నాయకులు ఈటల రాజేందర్‌, సోయం బాపూరావు తదితరులు ప్రసంగించారు. బండి సంజయ్‌ 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర డిసెంబరు 16వ తేదీ వరకూ కొనసాగుతుంది.