ఓట్ల చోరితో బీజేపీ అధికారంలోకి వచ్చింది
- బీజేపీపై జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు
- బీజేపీకి త్యాగాల చరిత్రే లేదని వ్యాఖ్య.
- రాహుల్ గాంధీ కాశ్మీర్ బ్రాహ్మణ కులమని స్పష్టం.
- సోనియా గాంధీ ప్రధాని పదవి త్యాగం చేశారు
కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అసత్య ప్రచారం చేస్తూ, లేనివి ఉన్నట్లు చెప్పి గాంధీ కుటుంబంపై బురద జల్లడం మాత్రమే పనిగా పెట్టుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. త్యాగాల చరిత్రే లేని బీజేపీ, దేశ సేవలో అపారమైన త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని విమర్శించడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా తమ తల్లిదండ్రులను అడిగితే గాంధీ కుటుంబం చేసిన సేవలు, గొప్పతనం చెబుతారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. భర్త ఏ కులానికి చెందినవాడో భార్య కూడా అదే కులానికి చెందుతుందని అర్థం చేసుకునే తెలివి బీజేపీ నేతలకు లేదని, రాహుల్ గాంధీ కాశ్మీర్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారని స్పష్టం చేశారు. సోనియా గాంధీ ఈ దేశ మహిళేనని, ఆమెను దేశ ప్రజలే అంగీకరించారని తెలిపారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత సోనియా ఏడు సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపారని, ప్రజల అభ్యర్థన మేరకే రాజకీయాల్లోకి ప్రవేశించారని వివరించారు. ప్రధాని పదవి అందుబాటులో ఉన్నప్పటికీ సోనియా, రాహుల్ గాంధీలు దానిని త్యజించారని, అలాంటి త్యాగం బీజేపీ నేతలు ఎప్పుడైనా చేయగలరా? అని ప్రశ్నించారు. నిన్నమొన్న పుట్టినవారు కూడా గాంధీ కుటుంబంపై మాట్లాడటం ఆశ్చర్యకరమని, సోనియా గాంధీ కాలి గోటికి కూడా బీజేపీ నేతలు సరిపోరని ధ్వజమెత్తారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కే. అద్వానీ లాంటి విలువలతో నడిచిన బీజేపీ ఇప్పుడు మాయం అయిపోయిందని అన్నారు. ఇంకా, బీజేపీ మూడు సార్లు అధికారంలోకి రావడానికి ఓట్ల దొంగతనే కారణమని ఆరోపించారు. ఇద్దరు మాత్రమే ఉండే ఇంట్లో వందమంది ఓటర్లు ఉన్నట్లు, చనిపోయినవారి పేర్లు కూడా ఓటర్ జాబితాల్లో ఉన్నట్లు ఉదాహరణలు చూపించారు. ఎన్నికల కమిషన్ ఇలాంటి అక్రమాలపై మౌనంగా ఉందని విమర్శించారు. రాహుల్ గాంధీ ఈ అక్రమాలను బహిర్గతం చేయడంతో బీజేపీ నేతలకు భయం మొదలైందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

