home page sliderHome Page SliderNewsNews AlertPoliticsTelanganatelangana,Trending Todayviral

రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన బీజేపీ

తెలంగాణ బీజేపీలో తీవ్ర అసంతృప్తికి గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయడం రాజకీయంగా పెద్ద సంచలనంగా మారింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావును నియమించడంపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేసిన రాజాసింగ్, తాను కూడా అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలని ప్రయత్నించగా, పార్టీ ఆ నాయకత్వం ఆ అవకాశం ఇవ్వకపోవడం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన జూన్ 30న బీజేపీకి రాజీనామా చేసి, పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్వయంగా లేఖను అందజేశారు. “మీకు ఓ దండం, మీ పార్టీకో దండం” అంటూ చేసిన వ్యాఖ్యలు మీడియా మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీశాయి. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజాసింగ్ రాజీనామాను అధికారికంగా ఆమోదించారు. దీంతో ఆయన బీజేపీలో గల సంబంధం పూర్తిగా ముగిసినట్టయింది. ఆయనతో పాటు ముగ్గురు బీజేపీ కౌన్సిల్ సభ్యులు కూడా రాజీనామా చేయడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణించబడుతోంది. గత కొన్నేళ్లుగా బీజేపీకి తాను తన ప్రాణం పెట్టానని, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు విశేషంగా శ్రమించానని, కానీ పార్టీ తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని రాజీనామా సమయంలో వాపోయారు. ప్రస్తుతం రాజాసింగ్ రాజకీయ భవిష్యత్‌పై అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కొందరు ఆయన జనసేన పార్టీలో చేరుతారని చెబుతుండగా, మరికొందరు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. అయితే అధికారికంగా ఆయన తదుపరి రాజకీయ కార్యాచరణ ఏదీ ప్రకటించలేదు. బీజేపీకి “రామ్ రామ్” చెప్పిన రాజాసింగ్ ఇక ఎటు ముఖం పెట్టి రాజకీయంగా ముందడుగు వేస్తారు అన్నది రాజకీయంగా ఆసక్తికరమైన అంశంగా మారింది.