విమానాన్ని ఢీకొట్టిన పక్షి..169 మంది ప్రయాణికులు
విమానాలకు పక్షుల తాకిడి (బర్డ్ హిట్) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం గాల్లో ఉండగా పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా వెనక్కి తిరిగి పాట్నా విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 169 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.పాట్నా విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. పక్షి బలంగా ఢీకొట్టడంతో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి పాట్నాలోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు.ప్రస్తుతం విమానానికి మరమ్మతులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇలా ప్రధాన విమానయాన సంస్థలకు చెందిన విమానాలు వరుసగా బర్డ్ హిట్ బారిన పడుతుండటంతో ప్రయాణికుల్లో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.