బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారీ షాక్..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లా ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్‌లోని హసీనా, ఆమె కుటుంబసభ్యులకు సంబంధించిన 124 బ్యాంకు ఖాతాలు జప్తు చేయాలని అక్కడి న్యాయస్థానం ఆదేశించింది. వీటిలో దాదాపు 600 కోట్ల టకా( బంగ్లాదేశ్ కరెన్సీ) ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఆమె కుమారుడు సాజిద్ వాజెద్ జాయ్, కుమార్తె సైమా వాజెద్ వుతుల్, సోదరి షేక్ రెహానా, ఆమె కుమార్తెకు చెందిన ఆస్తులను జప్తు చేయాలని కూడా ఆదేశించింది. బంగ్లాలోని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితులలో గతేడాది ఆగస్టు 5న హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమె హయాంలోని మంత్రులు, సలహాదారులు, అధికారులు పలు నేరాలకు పాల్పడ్డారంటూ బంగ్లాదేశ్‌కు చెందిన యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. హసీనాను అప్పగించాలంటూ భారత్‌కు పలుమార్లు లేఖ రాసింది. దీనిపై భారత ప్రభుత్వం స్పందించలేదు.

