Andhra PradeshNews Alert

సినీ నటులకు జగన్ పదవులు

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఎంతోమంది సలహాదారులను నియమించిన జగన్ త్వరలో ఇద్దరు సినీ నటులను సలహాదారులుగా నియమించనున్నట్లు తెలుస్తుంది. సినీ నటుల్లో ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడిన వారిలో పృథ్వి రాజు, పోసాని కృష్ణ మురళి, విజయ చందర్, ఆలీలు ముందు వరసలో ఉన్నారు. ఇందులో పృధ్విరాజ్‌కు గతంలోనే SVBC చానల్‌కు చైర్మన్ గా నియమించిన జగన్ అప్పట్లో ఆయన మీద వచ్చిన వివిధ ఆరోపణల నేపథ్యంలో పదవి నుంచి తొలగించారు. అలానే విజయ్ చందర్‌కు ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఆయన ఆ పదవి పొందిన కూడా ఆ కార్పోరేషన్ అభివృద్ధికి ఎలాంటి ప్రభావం చూపలేకపోయారని అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అయింది.

మరొక సినీ నటుడు అలీ ఇటీవల కాలంలో సీఎం జగన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ముస్లిం మైనారిటీ కోటాలో ఆలీకి రాజ్యసభ ఇస్తారని అందరూ భావించారు. వివిధ కుల సమీకరణాలలో భాగంగా ఆయనకు రాజ్యసభ సీటు దక్కలేదు. దీంతో ఆయనకు ఒక మంచి పదవిని ఇవ్వాలని భావించిన జగన్ త్వరలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. అలీతో పాటు మరో సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కూడా వైసీపీ అధికారంలో రావటానికి ఎంతో కృషి చేశారు. తన మాటలు, విమర్శలతో ఎప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడే పోసాని ఏ రోజు నాకు పదవి కావాలి అని జగన్‌ను అడిగిన సందర్భాలు లేవు. కానీ పోసాని కి కూడా సమచిత స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో జగన్ ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

ఇద్దరి నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు ఒకేసారి వస్తాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్నాయన్న ఊహగానాల నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా జిల్లాల వారీగా వేగవంతం చేసేందుకు ఆ నియామకాలను కూడా అధిష్టానం ఈ మధ్యకాలంలో చేపట్టింది. ఇప్పుడు అలీ పోసాని కృష్ణ మురళిలను కూడా ప్రభుత్వంలో తీసుకుని వారి సేవలను మరింతగా పార్టీకి ఉపయోగించుకునేందుకు జగన్ సిద్ధమయ్యారు.