ఆర్టీఐ కమిషన్ లో బీసీ, ఎస్సీ లకు చోటు కల్పించాలి..
ఎమ్మెల్సీ కవిత ఇటీవల తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వేస్తున్నారు. ఈ క్రమంలో, తాజాగా సమాచార హక్కు చట్టం కమిషన్‌లో బీసీలు, ఎస్టీలకు ప్రాతినిధ్యం లేదని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఇప్పటి వరకు నియమించిన చీఫ్ కమిషనర్‌తో పాటు నలుగురు కమిషనర్లలో ఒక్కరు కూడా బీసీ లేదా ఎస్టీ వర్గానికి చెందినవారు కాదని కవిత తెలిపారు. అంతేకాక, మిగతా ముగ్గురు కమిషనర్ల నియామకానికి రూపొందించిన ప్రతిపాదనల్లో కూడా బీసీ, ఎస్టీలకు అవకాశం ఇవ్వలేదని ఆమె అభిప్రాయపడ్డారు. జనాభా ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఉంటే, కమిషనర్ల పోస్టుల్లో కూడా వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ పోస్టులను బీసీ, ఎస్టీలతో భర్తీ చేయాలని కోరుతూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ నియామకాల ద్వారా తెలుస్తుందన్నారు. కవిత వ్యాఖ్యలతో పాలనలో సామాజిక సమానత్వం, ప్రాతినిధ్యం వంటి అంశాలపై చర్చ జరుగుతోంది.