NationalNews Alert

ఉద్యానవన నగరంలో ముంపుకు కారణమేమిటి ?

ఉద్యానవనాల నగరంగా పిలువబడే అందమైన నగరం బెంగళూరు. నాలుగు వందల ఏళ్ల క్రితమే అప్పటి పాలకుడు కెంపేగౌడ చక్కటి ప్రణాళికతో ఒక పద్దతిగా నిర్మించిన సుందర నగరం ఈ బెంగళూరు. ఈ నగరం చక్కటి రోడ్లు, కాలనీలు, చెరువులతో తీర్చిదిద్దినట్లుటుంది. చెరువులు, కాలువలు కూడా ఎన్నో ఉండేవి.

కానీ నేడు చిన్న చిన్న వర్షాలకే ఇప్పుడు రోడ్లు, వీధులు మునిగిపోతున్నాయి. ప్రజలు అవస్థల పాలవుతున్నారు. చెరువులను ఆక్రమించి చదును చేసి లేఔట్లు నిర్మించడం వల్ల విపత్తులు పుట్టుకొస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల అకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడం, వర్షపునీరు రోడ్లలో, లోతట్టు ప్రాంతాలలో చొరబడి ముంపులు తలెత్తుతున్నాయి.

బెంగళూరు నగరంలో చెరువుల స్థానంలో నిర్మించిన రకరకాల కట్టడాల వివరాలు

కోరమంగళ చెరువు- నేషనల్ గేమ్స్ కాంప్లెక్స్

సిద్దికట్టె చెరువు- కేఆర్ మార్కెట్

శూలే చెరువు- ఫుట్ బాల్ స్టేడియం

అక్కితిమ్మనహళ్లి చెరువు- హాకీ స్టేడియం

కారంజీ చెరువు- గాంధీ బజార్

నాగశెట్టిహళ్లి చెరువు- స్పేస్ డిపార్టమెంట్

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెరువులు బజార్లుగా, మైదానాలుగా, బస్టాండ్లుగా, నివాస ప్రాంతాలుగా మారిపోయాయి. ప్రతి సంవత్సరం బెంగళూరు నగర అభివృద్ధి పనులకోసం దాదాపు 20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ వరదముంపు సమస్యను తప్పించడం సాధ్యం కావడం లేదు. బీబీఎంపీ బడ్జెట్ సుమారు 11 వేలకోట్ల రూపాయలు కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి మరో 10 వేల కోట్ల నిధులు లభిస్తుంటాయి. అయినా ప్రజల సమస్యలు అలాగే ఉన్నాయి.

బెంగళూరులో 50 ఏళ్లక్రిందట 837 చెరువులుంటే నేడు వాటి సంఖ్య 219 కి పడిపోయింది. ఈ చెరువులుండే స్థలాల్లో 1, 15,000 కట్టడాలు నిర్మాణం జరిగినట్లు అంచనా.

రాజకాలువల్లో 1,35,000 వరకూ కట్టడాల నిర్మాణం జరిగింది.

ఒకప్పటి పొలాలు, చిట్టడవులు మాయమైపోయాయి. ప్రస్తుతం వర్షంతో జలమయమైన ఈ లేఔట్లు గతంలోని పొలాలు, చెరువులు, చిట్టడవులతో కూడుకున్న ప్రదేశాలే. బెంగళూరులోనే కాదు, హైదరాబాదులో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా చెరువులు ఆక్రమించి కాలనీలు, అపార్ట్‌మెంట్లు కట్టేస్తున్నారు. ప్రకృతిని కాపాడుకోలేక పోతే ప్రజలే ఇబ్బందులకు గురికావలసి వస్తుంది. చెరువుల విస్తీర్ణం గత 40 ఏళ్లలో సగానికి పైగా తగ్గిపోయింది. అక్రమ కట్టడాలు తొలగించి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే ప్రకృతికి మంచి జరుగుతుంది.