పాకిస్తాన్‌లో ఘోరం- తాజా సర్వేలో వెల్లడైన నిజాలు
మన దాయాది దేశం పాకిస్థాన్‌లో తాజాగా జరిగిన సర్వేలో కొన్ని ఘోరమైన నిజాలు బయటపడ్డాయి. అక్కడ ప్రతి 2 గంటలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతునట్లు తెలిసింది. అంతేకాదు పరువు హత్యలు కూడా బాగా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘సమా’ టీవీ పరిశోధన విభాగం జరిపిన సర్వేలో ఈ వివరాలు బయటపడ్డాయి. పంజాబ్ హోం, మానవ హక్కుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన ఈ వివరాలను బట్టి అత్యాచార కేసులు నమోదైన వారిలో 0.2 శాతం మాత్రమే శిక్షకు గురవుతున్నారని, అత్యాచార కేసులు పెరగడానికి ఇదే ముఖ్య కారణమని తెలుస్తోంది. 2017 నుండి 2021 మధ్యకాలంలో పాకిస్తాన్‌లో 21,900 మంది మహిళలు అత్యాచారానికి గురై ఉండొచ్చని ఈ సర్వేలో బయటపడింది. ఈ లెక్కన రోజుకు 12 మంది, రెండు గంటలకు ఒక్కరు చొప్పున అత్యాచారం జరిగినట్లు తేలింది. అయితే ఇవి బయటపడిన కేసులు మాత్రమేనని, సమాజానికి, కుటుంబానికి భయపడి ఇంకెంతమంది నోరు విప్పటంలేదో తెలియదని ‘సమా’ అభిప్రాయపడింది. పాక్‌లో స్త్రీ,పురుష నిష్పత్తి 56.4 శాతంగా ఉన్నట్లు WEF తెలిపింది. ప్రపంచంలోనే మహిళలపై పక్షపాతం చూపే దేశాలలో మొదటిస్థానంలో నిలిచినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. పరువు హత్యలు,మహిళలపై అత్యాచారాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అమెరికాతో సహా అనేక దేశాలు పాకిస్తాన్‌ను కోరుతున్నాయి. పాక్ ప్రభుత్వం ఈ విషయంలో కళ్లు తెరిచి తగిన చర్యలు చేపట్టవల్సిన అవసరం ఎంతైనా ఉంది.

