Andhra PradeshNewsNews Alert

బాబు పర్యటన ఉద్రిక్తం.. కుప్పంలో రణరంగం

సొంతవూరు.. సొంత నియోజకవర్గం. అంతా తన వారే. పార్టీకి బలమైన కేంద్రం. గట్టి పునాదులు ఉన్న ప్రాంతం. ధైర్యంగా ఆ గడ్డ మీద కాలు పెడితే.. వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. వెంట పడ్డాయి. రాళ్ళ దాడులు చేశాయి. ఇదేం.. అరాచకం అంటే .. నోళ్ళన్ని ఒక్కసారిగా లేచాయి. విమర్శలు గుప్పించాయి. జెండాల గొడవ మంటలు మండించాయి. ఇవీ.. ఇప్పుడు కుప్పంలో నెలకొన్న పరిస్ధితులు. చంద్రబాబు పర్యటనలో తలెత్తిన ఉద్రిక్తతలు.

మూడు రోజుల పర్యటన కోసం చంద్రబాబు కుప్పంలో అడుగు పెట్టిన దగ్గర నుండి పరిస్ధితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆయన పర్యటించే మార్గాల్లో టీడీపీ జెండాలకు ధీటుగా వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో గొడవ ప్రారంభం అయ్యింది. వాటిని తొలగించాలని టీడీపీ వారు కోరినా ససేమిరా అన్నారు. అంతే కాదు.. దాడులకు దిగారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు సద్ది చెప్పడానికి ప్రయత్నించినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. దీంతో పరస్పరం రాళ్ళ దాడులు చేసుకున్నాయి. ఇందులో చాలా మంది గాయపడ్డారు. ఆరోజు ముగిసింది కదా అనుకుంటే మరునాడు కూడా అదే టెన్షన్. కుప్పం ప్రధాన కూడలి వద్ద ఒకవైపు వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇంకోవైపు ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి. ఎన్టీయార్ విగ్రహం దగ్గర తెలుగుదేశం పార్టీ .. అన్నా క్యాంటిన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ క్యాంటిన్ ను చంద్రబాబు ప్రారంభించాల్సి ఉంది. అయితే అదే ప్రాంతానికి వైసీపీ ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్ చేరుకోవడంతో కార్యకర్తలు రెచ్చి పోయారు. వారిని చూసుకుని టీడీపీ ఫ్లెక్సీలను చించివేశారు. టీడీపీ వారి కార్యక్రమం కోసం తెచ్చి పెట్టిన టేబుళ్ళను ధ్వంం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో నిరసనకు దిగారు. అదే సమయంలో చంద్రబాబు కూడా అన్నాక్యాంటిన్ దగ్గర బైఠాయించారు. దీంతో ఏం చేయాలో తెలియక.. ఎవరికి సద్ది చెప్పలేక పోలీసులు తలలు పట్టుకున్నారు.

కుప్పం నియోజకవర్గంలోని కొల్లుపల్లిలో జరిగిన రాళ్ళ దాడులకు నిరసనగా తాము ఆందోళన చెస్తున్నట్లు వైసీపీ కార్యకార్తలు చెబుతున్నారు. మా నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం దగ్గర ఆందోళన చేసేందుకు వచ్చాం. తమను రెచ్చగొట్టింది టీడీపీ వారేనంటూ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దీంతో ఇరు పార్టీలు బల ప్రదర్శనకు దిగడంతో పరిస్ధితి చేదాటి పోయింది. రణరంగంగా మారింది. ఎమ్మెల్సీ భరత్ ఇచచిన పిలుపుతో వైసీపీ కార్యకర్తలు పొలో మంటూ వచ్చేశారు. చంద్రబాబును చూసి ఇంకా రెచ్చి పోయారు. అప్పటికే టీడీపీ కార్యకర్తలు కుప్పం చేరుకోవాలని ఆ పార్టీ నేత పులివర్తి నాని పిలుపునివ్వడం.. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అక్కడకు చేరుకోవడం జరిగింది. దీంతో అంతా యుద్ధ వాతావరణం ఏర్పడింది.

కుప్పంలో ఏర్పడ్డ పరిస్ధితుల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా బలగాలను దించారు. ఇతర జిల్లాల నుండి కూడా బలగాలను కుప్పం రప్పిస్తున్నారు. దీంతో ఏం జరుగుతోందో తెలియని భయాందోళనలు ఏర్పడ్డాయి. కుప్పంలోని అన్ని విద్యా సంస్ధలకు సెలవు ప్రకటించారు. కుప్పం నుండి వెళ్ళాల్సిన ఆర్టీసీ బస్సులను నిలిపి వేశారు.ఈ పరిణామాలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వైసీపీ చేసిన రాళ్ళ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు అభివర్ణించారు. ఇందుకు మంత్రి పెద్దిరెడ్డి బాధ్యవహించాలంటూ డిమాండ్ చేశారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడైనా జరిగిందా అంటూ ప్రశ్నించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన సర్కార్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఓ భయానక వాతావరణాన్ని కల్పిస్తోందని ఆయన మండి పడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఇక గెలిచేది టీడీపీయే అని తేలి పోయిందన్నారు అచ్చెన్నాయుడు. రానున్న ఓటమి భయంతోనే ఇలా దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు.

కుప్పం చరిత్రలో ఇది చీకటి రోజుగా మిగిలిపోతుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇక కుప్పం నుంచే ధర్మపోరాటం మొదలు పెడుతున్నానని ప్రకటించారు. ఇక చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారిపై కూడా దాడికి యత్నించారు. ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఆ తర్వాత వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‎కు తరలించారు.