బాబుగారు ఇప్పుడేం చేద్దాం… వాట్ టుడూ..! వాట్ నాట్ టుడూ..!
రాజకీయాలు ఎప్పుడు అనుహ్య కోణంలో మారుతుంటాయ్. చంద్రబాబు అరెస్టు అందుకు ఒక కారణం కాబోతుందా అన్న చర్చ వైరల్ అవుతోంది. ఇవాళ చంద్రబాబు పిటిషన్ విచారణకు వస్తుందా లేదా అన్న చర్చ సాగుతోంది. అయితే చంద్రబాబు నాయుడుకి బెయిల్ వస్తుందా రాదా అన్న ఉత్కంఠ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతల్లో అయోమయం నెలకొంది. చంద్రబాబు అరెస్టుపై తీవ్రంగా స్పందించలేక కక్కాలేక మింగాలేక అన్న పొజిషన్లో నేతలున్నారు.

అసలు జగన్ మోహన్ రెడ్డికి ఇంత బలం ఎలా వచ్చిందన్నదానిపై ఎంతో అలజడి టీడీపీలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చూసుకొని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారా అని టీడీపీ నేతలు మధనపడుతున్నారు. వాస్తవానికి పసుపు పార్టీ పుట్టిన తర్వాత అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎప్పుడూ టీడీపీని ఆగస్టు సంక్షోభం వెంటాడేది. కాకుంటా ఈసారి ఆగస్టు మాసం తర్వాత వచ్చే సెప్టెంబర్, పసుపు పార్టీలో సునామీ తీసుకొస్తోంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగా లోకేష్ పార్టీని నడిపిస్తారని పార్టీ నాయకులు అనుకుంటున్నారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో లోకేష్ కూడా అరెస్ట్ అవుతారన్న చర్చ ఇప్పుడు పార్టీ నేతలను కంగారుపెట్టిస్తోంది.

చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే మరో కీలక వ్యక్తిని సైతం త్వరలో అరెస్ట్ చేసే అవకాశమున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు పరోక్ష సంకేతాలిస్తున్నాయి. ఇప్పటికే విచారణ తుది దశకు వచ్చిందని… ఇక అరెస్ట్ మాత్రమే మిగిలి ఉందన్న వర్షన్ వారు విన్పిస్తున్నారు. తాను కేవలం చంద్రబాబుతో మాత్రమే పోరాటం చేయడం లేదని దుష్ట చతుష్టయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటూ పదేపదే జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు సంస్థపై ఇప్పటికే విచారణ కీలక దశలో ఉంది. మొత్తంగా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతుందన్న ఊహాగానాల నడుమ ఈరోజు మరింత మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ హైకోర్టులో చంద్రబాబు నాయుడుకి ఉపశమనం లభించని పక్షంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న దానిపై కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ఏపీలో మరో ఆరేడు మాసాల్లో ఎన్నికలు రానున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సానుభూతి కలిగించి పార్టీని మరోసారి విజయతీరాలకు చేర్చుతోందా, లేదంటే పార్టీని మరింతకుంగదీస్తుందా అన్న మీమాంశ ఎక్కువవుతోంది. చంద్రబాబు నాయుడు బయట ఉంటే వ్యూహాలను అమలు చేయగలరు. లేదంటే పార్టీని ముందుకు నడిపించడం కష్టతరమవుతుంది. మొత్తంగా చంద్రబాబు నాయుడుకు వచ్చే నాలుగైదు రోజులు టీడీపీకి అత్యంత కీలకమని చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ అండర్స్టాండింగ్ కుదిరి బెయిల్ వస్తే వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు మరింత దూకుడు ప్రదర్శించి, ఏపీలో మరోసారి పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ బెయిల్ రాని పక్షంలో ఇది టీడీపీకి రాజకీయంగా ఎదురు దెబ్బ అవుతుందనడంలో అనుమానం లేదు.

