బాబాయ్ హత్య వాళ్లకి చిన్న విషయం
అమరావతి:”బాబాయ్ హత్యే వాళ్లకి చిన్న విషయమైనప్పుడు.. ఇక పరకామణి చోరీ కేసు వాళ్లకి పెద్ద విషయం ఎలా అవుతుంది?,” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల పరకామణి చోరీ కేసుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో సీఎం శనివారం ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
“బాబాయ్ హత్యే వాళ్లకి చిన్న విషయమైనప్పుడు.. ఇక పరకామణి చోరీ కేసు వాళ్లకి పెద్ద విషయం ఎలా అవుతుంది?” అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏమాత్రం నైతికత లేని వారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని మండిపడ్డారు.
తిరుమల పరకామణిలో కేవలం రూ.70వేల చోరీకి గాను, దోపిడీదారులకు రూ.14కోట్ల ఆస్తి రాసిచ్చేందుకు సిద్ధపడ్డారంటే ఇంకెంత సంపాదించి ఉంటారని ఆయన నిలదీశారు. దీనిని బట్టి టీటీడీ లో దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందని పేర్కొన్నారు.
శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. జగన్‌కు దేవుడన్నా, ఏడుకొండల వాడి భక్తుల మనోభావాలు అన్నా, ఆలయాల పవిత్రత అన్నా లెక్కలేదని దుయ్యబట్టారు.బాబాయి హత్యనే సెటిల్ చేసుకుందాం అని చూసిన జగన్, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూడటం ఘోరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.”దొంగతనాన్ని కూడా తప్పు కాదు అని చెప్పే వాళ్లను ఏమనాలి? దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు వెనక్కి కట్టాడు కదా, తప్పేముంది అని జగన్ అత్యంత అనైతికంగా వాదిస్తున్నాడు,” అని చంద్రబాబు మండిపడ్డారు.శ్రీవారి హుండీలో చోరీపై జగన్ వ్యాఖ్యలపై అన్ని వర్గాల ప్రజల్లోను తీవ్ర ఆవేదన కనిపిస్తోందని, దేవుడి హుండీలో చోరీని సెటిల్ చేయటానికి జగన్ ఎవరని ఆయన నిలదీశారు. కోట్ల మంది భక్తులు విశ్వాసాలు దెబ్బతీసేలా మాట్లాడటం ఘోర పాపం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.”చుక్క పాలు లేకుండానే నెయ్యి తయారు చేసి దేవుడి ప్రసాదానికి సరఫరా చేసిన ఘనులా వీళ్లు అని సర్వత్రా చర్చ జరుగుతోంది,” అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. భక్తులు ఇచ్చిన కానుకలు, ముడుపులను కొట్టేసిన దొంగలతో సెటిల్మెంట్ ఏంటి అని ప్రశ్నించారు.గతంలో నెల్లూరు, విజయనగరం జిల్లాలు ఎంతో ప్రశాంతంగా ఉండేవని, కానీ వైసీపీ హయాంలో నెల్లూరులో కూడా చాపకింద నీరులా మాఫియాను విస్తరింపజేశారని, ‘లేడీడాన్స్’ తయారవడం చూసి ఆశ్చర్యం కలిగిందని సీఎం అన్నారు.”లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ ప్రసక్తే లేదు,” అని స్పష్టం చేసిన సీఎం, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, అధికారం చేపట్టిన నాటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని తెలిపారు. రాజధానిలో సమస్యలన్నీ పరిష్కారమై అభివృద్ధి జరుగుతుండటం ప్రజలకు ఆనందంగా ఉందని, ఇది రాజకీయంగా కొందరు తట్టుకోలేక బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.హైదరాబాద్ అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ, తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన అభివృద్ధి బీజం ఫలితంగానే కోకాపేటలో ఎకరం భూమి రికార్డు స్థాయిలో ధర పలుకుతోందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

