గుంటూరులో మంత్రి విడదల రజిని కార్యాలయంపై దాడి
గుంటూరులో పార్టీ కార్యాలయంపై దాడి టీడీపీ గుండాల అధికార దాహానికి పరాకాష్ట అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఆదివారం అర్ధరాత్రి వందలాది మంది టీడీపీ గూండాలు మద్యం మత్తులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం నూతన కార్యాలయంపై రాళ్లు విసిరి ధ్వంసం చేయడంతో మంత్రి, ఎమ్మెల్యే మద్దాలి గిరి సోమవారం ఉదయం కార్యాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో బీసీ మహిళనైన తన పోటీని చూసి ఓర్వ లేకనే టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని అందుకే ఇలాంటి భౌతిక దాడులకు దిగుతున్నారని పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారమే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. దీనివెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే మద్దాలి గిరి మాట్లాడుతూ బీసీ మహిళ పోటీ చేయడాన్ని తట్టుకోలేక టీడీపీ రౌడీలు దాడులకు పాల్పడ్డారని, ప్రజలే వారికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
