పల్నాడులో దారుణం..అన్నదమ్ములనే చంపిన మహిళ
పల్నాడు జిల్లాలోని నకిరేకల్‌లో దారుణం జరిగింది. కృష్ణవేణి అనే మహిళ, తండ్రి ఆస్తి, పెన్షన్ కోసం తోడబుట్టిన అన్నదమ్ములనే కిరాతకంగా హతమార్చింది. కృష్ణవేణి తండ్రి పౌలు రాజు గిరిజన సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ, పక్షవాతంతో చనిపోయాడు. అతని పెద్ద కుమారుడు గోపీకృష్ణ, చిన్న కుమారుడు దుర్గా రామకృష్ణ ఇద్దరూ భార్యలు విడిచి పెట్టడంతో తండ్రి వద్దే ఉంటున్నారు. కుమార్తె కృష్ణవేణి కూడా కుటుంబ కలహాలతో భర్తను విడిచిపెట్టింది. ఈ క్రమంలో తండ్రి చనిపోయాక ఆస్తి కోసం, ఫ్యామిలీ పెన్షన్ కోసం వీరి మధ్య తగాదాలు ఎక్కువయ్యాయి. అనారోగ్యంతో ఉన్నప్పుడు తండ్రిని తానే చూసుకున్నానని తండ్రి డబ్బు తనకే దక్కాలని కృష్ణవేణి పట్టుపట్టింది. అయితే అన్న, తమ్ముడు ఒప్పుకోకపోవడంతో తరచూ ఘర్షణలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి అడ్డు తొలగించుకోవాలని మద్యం తాగే అలవాటున్న అన్నకు అతిగా మద్యం తాగించి, చున్నీతో ఉరి బిగించి హత్య చేసింది. తమ్ముడిని కాలువలో తోసేసి చంపినట్లు సమాచారం. అయితే వీరిద్దరి మృతదేహాలు ఇంతవరకూ దొరకలేదు. పోలీసులు కృష్ణవేణిని అరెస్టు చేసి, విచారిస్తున్నారు. ఆమెకు మరొకరు సహాయం చేసి ఉంటారని, ఆమెకు మరో వ్యక్తితో సంబంధం ఉందని స్థానికులు చెప్తున్నారు.

