ఆర్యసమాజ్ వివాహ ధ్రువపత్రాలు చెల్లవు- అలహాబాద్ హైకోర్టు
ఆర్యసమాజ్ సొసైటీ ఇచ్చే వివాహ ధ్రువపత్రాలు చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది అలహాబాద్ హైకోర్టు. ఏ వివాహాన్ని అయినా తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ఒక తండ్రి తన కుమార్తె విషయంలో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణలో న్యాయమూర్తి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ ఆర్యసమాజ్‌లు జారీచేసే వివాహ ధ్రువీకరణ పత్రాలతో కోర్టు నిండిపోయిందని, వాటికి చట్టబద్ధత లేదని తెలియజేశారు. ప్రస్తుత కేసులో చట్టబద్ధంగా వివాహం జరిగిందని నిరూపించడానికి పిటిషనర్ తన భార్య అని చెపుతూ భోలాసింగ్ అనే వ్యక్తి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. వారి వివాహానికి ఆర్యసమాజ్ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని ప్రమాణికంగా తీసుకోలేమని న్యాయమూర్తి జస్టిస్ సౌరభ్ శ్యాం సమాశ్రయ్ ఆదేశాలు ఇచ్చారు. ఆర్యసమాజ్ వివాహాలను తప్పనిసరిగా రిజిష్టర్ చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ కేసులో పెళ్లి చేసుకున్న వ్యక్తి మేజర్ కావడంతో ఆమెను అక్రమంగా నిర్భంధించారంటూ తండ్రి వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.