మునీర్ను అరెస్టు చేయండి : పెంటగాన్ మాజీ అధికారి
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనపై అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మైఖెల్ రూబిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునీర్‌కు గౌరవం చూపడం బదులుగా ఆయనను అరెస్టు చేయాల్సిందని రూబిన్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం జూన్‌లో డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో ఇచ్చిన విందును కూడా ఆయన తప్పుబట్టారు. గత ఏడాది కాలంగా తప్పుడు విధానాలు పాటించడం, భారత్‌పై 50 శాతం దిగుమతి సుంకాలు విధించడం వంటి చర్యలకు అమెరికా భారత్‌కు క్షమాపణలు చెప్పాల్సి ఉందని రూబిన్ అన్నారు. ట్రంప్ అహంభావం వల్ల క్షమాపణలు చెప్పకపోయినా, అమెరికా ప్రయోజనాల కోసం అలాంటి నిర్ణయం అవసరమని ఆయన తెలిపారు.
భారత్‌పై అదనపు దిగుమతి సుంకాలు విధించడం సరికాదని, రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో అమెరికా చేసిన ఒత్తిడి న్యాయసమ్మతం కాదని రూబిన్ స్పష్టం చేశారు. భారత్ లాంటి మిత్రదేశాన్ని దూరం చేసి, పాకిస్తాన్ ను ప్రోత్సహించడం వ్యూహాత్మకంగా తప్పు నిర్ణయమని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశమని, దానిని నాటోయేతర ప్రధాన మిత్రదేశంగా పరిగణించే అర్హత లేదని స్పష్టం చేశారు. మునీర్ మళ్లీ అమెరికాకు వస్తే అరెస్టు చేయాలని పెంటగాన్ మాజీ అధికారి మైఖెల్ రూబిన్ డిమాండ్ చేశారు.
భారత్‌ను రష్యాకు వదిలేయడాన్ని అమెరికన్లు ఎప్పటికీ స్వాగతించరని రూబిన్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ సర్కారు అసమర్థత వల్లే పుతిన్ భారత్ పర్యటనలో కీలక విజయాలు సాధించారని అన్నారు. ప్రస్తుతం అమెరికాలో 65 శాతం ప్రజలు ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నారని, ఆయన విధానాలకు మద్దతు తగ్గిపోయిందని రూబిన్ తెలిపారు. భారత్ చౌకగా లభించే రష్యా చమురును కొనుగోలు చేయడం పూర్తిగా సముచితమేనని, అమెరికా తనే తక్కువ రేటుకు చమురు అమ్మలేకపోతే విమర్శలు చేయడం సరికాదని రూబిన్ వ్యాఖ్యానించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అవసరాలను అర్థం చేసుకోకుండా అమెరికా భారత్‌పై ఒత్తిడి చేయడం తప్పు అని రూబిన్ స్పష్టం చేశారు. భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, ఆ దేశానికి నిరంతర ఇంధన సరఫరా అత్యవసరమని అన్నారు. రష్యా నుంచి ముడి చమురును కొనడం భారత్‌కు అవసరమని, అమెరికా కూడా రష్యా నుండి ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నప్పటికీ భారత్‌ను విమర్శించడం ద్వంద్వ వైఖరేనని రూబిన్ పేర్కొన్నారు.
ఇక భారత పర్యటనలో భారత్‌కు నిరంతరాయంగా ముడిచమురు, సహజ వాయువు, బొగ్గును సరఫరా చేస్తామని పుతిన్ ప్రకటించారు. భారత్‌తో అమెరికా సంబంధాలను దెబ్బతీసినందుకు అమెరికన్లు ట్రంప్‌పై ఆగ్రహంతో ఉన్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు.

