హజ్ యాత్రకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి..సంతోషం వ్యక్తం చేసిన ముస్లింలు
ఏపీలో ఉన్న ముస్లిం సోదరులు నేటి నుంచి యాత్రకు బయలుదేరనున్నారు. అయితే ఈసారి అధిక సంఖ్యలో ముస్లింలు యాత్రకు వెళ్తున్నందున ఆంధ్ర ప్రదేశ్ హజ్ కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదని ముస్లింలు కొనియాడుతున్నారు. కాగా ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా… అదేవిధంగా త్యాగానికి ప్రతీకగా బక్రీద్ ను జరుపుకుంటుంటారు. ఇక ఈ సందర్బంగా ముస్లింలు ఎక్కువమంది హజ్ యాత్రకు వెళ్తుంటారు. చాలామందికి ఈ యాత్ర జీవితాశయం కూడా.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హజ్ యాత్రకు వెళ్తున్న వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. యాత్రలో భాగంగా ముస్లిం సోదరులకు ఏమేమి అవసరాలు ఉంటాయి అనే విషయాలు తెలుసుకుని అన్ని రకాల సదుపాయాలను ప్రభుత్వమే అందిస్తోంది. ఈ సందర్బంగా హజ్ కమిటీ డైరెక్టర్ హఫీజ్ మంజూర్ మాట్లాడుతూ.. హజ్ కమిటీ ఆధ్వర్యంలో హాజీలకు కావలిసిన అన్ని ఏర్పాట్లను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో గుంటూరులో ఉన్న హజ్ క్యాంపు వద్ద భారీగా హాజీలు చేరుకున్నారు. ఇక ప్రభుత్వం నుంచి హాజీలకు అన్ని సౌకర్యలు కల్పిస్తున్నందున ముస్లిం సోదరులు జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా.. ముస్లిం సోదరులు హజ్ యాత్రలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ముస్లిం తన జీవితంలో కనీసం ఒక్కసారైనా హజ్ చెయ్యాలని కోరుకుంటారు. ముఖ్యంగా బక్రీద్ నాడు ఎలాగైనా యాత్రలో ఉండాలని భావిస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దగ్గరుండి ఏర్పాట్లు చేయడం, సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని పలువురు ముస్లింలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

