క్వాష్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పును రిజర్వు చేసిన సుప్రీంకోర్టు
చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుప్రీంకోర్టులో వాడిగా వేడిగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వారి వారి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున వాదిస్తూ ఈ కేసులో సెక్షన్ 17 ఏ వర్తించదని, అధికారిక నిర్ణయాలకు మాత్రమే వర్తిస్తుందని వాదించారు. ఈ సెక్షన్ అవినీతిపరులకు రక్షణగా మారకూడదని, కోట్ల రూపాయలు కాజేసిన అవినీతి ఆరోపణలు ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని కోరారు. అంతేకాక ఈ ఆరోపణలను సెక్షన్ 422 సీఆర్‌పీసీ కింద క్వాష్ చేయలేమన్నారు. ఛార్జిషీట్లు వేసి, విచారణ చేయాలని తన వాదన వినిపించారు. దీనిపై జస్టిస్ త్రివేది ఆరోపణలపైనే నిర్ణయాలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఇది అవినీతి కిందే వస్తుందని, లేదంటే క్వాష్ చేయండని రోహత్గీ ధర్మాసనాన్ని కోరారు. అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టు విచారించాలని, జీఎస్టీ, ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తులున్నాయన్నారు. నేరం జరిగిందంటూ వాదించారు.
వర్చువల్‌గా చంద్రబాబు తరపున న్యాయవాది హరీష్ సాల్వే కూడా వాదించారు. అనేక కేసులు 17 ఏ సెక్షన్ గురించి ఉదహరించారు. మొదట్లో చంద్రబాబు పేరు FIRలో లేదని, రిమాండ్ సమయంలో చేర్చారని, కక్ష పూరితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలియజేశారు. సీఐడీ నిబంధనలు పాటించకుండా విచారించిందని ఆరోపించారు. కోర్టు సెలవుల దృష్ట్యా చంద్రబాబుకు మథ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. కోర్టుకు అవసరమైతే లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తాం అంటూ సాల్వే తెలిపారు. సాల్వే విజ్ఞప్తిని అంగీకరించిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

