విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ
విమానంలో కొందరు ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తించడం, సిబ్బందిపై దాడి చేయడం వంటి ఘటనలు ఇటీవల తరచూ చూస్తున్నాం. తాజాగా జెట్ బ్లూ విమానం లో ఓ ప్రయాణికుడు తోటివారిని హడలెత్తించాడు. విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు ప్రయత్నించాడు. అమెరికా లోని లారెన్స్ లోగాన్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్యూర్టోరికోకు చెందిన మోరెల్స్ టెర్రోస్ అనే వ్యక్తి విమానంలో తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టెర్రోస్ ఆవేశంతో విమానం అత్యవసర ద్వారాన్ని తెరిచి దూకేందుకు యత్నించాడు. దీంతో ఒక్కసారిగా తోటి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. సమీపంలోని విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమాన సిబ్బంది ఫిర్యాదుతో మసాచుసెట్స్ పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆతర్వాత నిందితుడికి బెయిల్ లభించగా.. కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. విచారణ నిమిత్తం మసాచుసెట్స్‌కి తప్ప భవిష్యత్తులో మరే ప్రాంతానికి ప్రయాణించకూడదని పేర్కొంది.